అత్యుత్సాహంతో కొందరు నేతలు చేసే పనులు కొత్త కొత్త వివాదాలకు కారణమవుతాయి. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న వేళ.. తమ ఇమేజ్ పెంచేందుకు వీలుగా జనం కంట్లో తాము పడే పోస్టుల్ని పెడుతున్నారు. ఈ సందర్భంగా కొందరు హద్దులు దాటేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒకటి ఏపీ బీజేపీ నేత పుణ్యమా అని చోటు చేసుకుంది.
ఈ రోజు జాతిపిత గాంధీ మహాత్ముడ్ని పొట్టనపెట్టుకున్న నాథూరాం గాడ్సే వర్ధంతి. ఈ సందర్భంగా ఏపీ బీజేపీకి చెందిన నాగోతు రమేశ్ నాయుడు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ రోజు గాడ్సే వర్థంతని.. ఈసందర్భంగా ఆయనకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భరతభూమిలో ఇంతటి గొప్ప దేశ భక్తుడు ఇక జన్మించడన్నారు.
ఈ తరహా ట్వీట్ సంచలనంగా మారటమే కాదు.. భారీ వైరల్ గా మారింది. కాసేపటికే తిట్ట వర్షం మొదలైంది. మహాత్ముడ్ని చంపిన గాడ్సే దేశ భక్తుడైతే.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ దేశద్రోహా? అంటూ విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన ఆయన.. తప్పుజరిగిందని లెంపలేసుకున్నారు. తాను పోస్టు చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన పొరపాటుపై వివరణ ఇస్తూ.. తన ట్విట్టర్ ఖాతాను వేరే వారు హ్యాండిల్ చేస్తున్నారని.. వారి అభ్యంతరకర పోస్టు పెట్టినందుకువారిని తొలగించినట్లుగా పేర్కొన్నారు. అయినా.. ట్విట్టర్ ఖాతాను ఎంత హ్యాండిల్ చేసినా.. కీలకమైన పోస్టుల్ని పెట్టే ముందు క్రాస్ చేసుకోకుండా ఓకే చెప్పేయటమా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.