ఒకప్పుడు టాలీవుడ్లో వైభవం చూసిన సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పాటుగా టాలీవుడ్ టాప్-4 హీరోల్లో ఒకడిగా నాగ్ రేంజే వేరు అన్నట్లుండేది. కానీ తర్వాతి తరం హీరోల జోరు మొదలయ్యాక నాగ్ రేంజ్ పడిపోతూ వచ్చింది. ఐతే ఒక దశలో ‘సోగ్గాడే చిన్నినాయనా’తో ఆయన బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. పడిపోతున్న క్రేజ్, మార్కెట్‌ను తిరిగి తెచ్చుకుంటున్నట్లే కనిపించాడు. కానీ సాఫీగా సాగిపోతున్న ఆయన కెరీర్‌ను ‘ఆఫీసర్’ మామూలు దెబ్బ కొట్టలేదు.
రాంగ్ టైంలో రామ్ గోపాల్ వర్మతో జట్టు కట్టి తన మీద నెగెటివిటీ వచ్చేలా చేసుకున్నాడు. ఆ సినిమా నాగ్‌కు బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరమైన పరాభవం మిగిల్చింది. ఇక అక్కడ్నుంచి నాగ్ పుంజుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘వైల్డ్ డాగ్’ సైతం కనీసం ఐదు కోట్ల షేర్ రాబట్టలేని పరిస్థితి. ఇక గత ఏడాది వచ్చిన ‘ఘోస్ట్’ సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘నా సామి రంగా’తో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. దీని కంటే కూడా నాగ్ తర్వాత చేయాల్సిన సినిమా చాలా ముఖ్యమైంది. ఆయనకు అది వందో సినిమా కావడం విశేషం. ఏ హీరోకైనా వందో సినిమా అంటే చాలా ప్రతిష్టాత్మకం. ఈ మైల్స్టోన్ మూవీని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజాతో చేయాలని ఒక దశలో అనుకున్నాడు నాగ్. ఇద్దరి మధ్య కొంతమేర డిస్కషన్లు కూడా జరిగాయి. నాగ్ అభిమానులు కూడా ఈ కాంబినేషన్ ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇప్పుడు మోహన్ స్థానంలోకి మరొకరు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అతను కూడా తమిళ దర్శకుడే కావడం గమనార్హం. తన పేరు నవీన్. తమిళంలో ‘మూడర్ కూడం’ అనే ప్రయోగాత్మక చిన్న చిత్రంతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందులో నవీన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషఇంచాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీని తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా ‘అగ్ని సిరగులల్’ అనే చిత్రం తీశాడు. ఇది త్వరలోనే విడుదల కానుంది. ఐతే ఒక చిన్న సినిమాతో మెప్పించి.. ఇంకా రెండో సినిమా ఫలితం చూడని దర్శకుడికి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును అప్పగించడం కరెక్టా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
వందో సినిమా అంటే నాగ్ ఫ్యాన్స్, మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు.. నాగ్ విషయంలో నోస్టాల్జిక్గా ఫీలయ్యేలా సినిమా తీస్తే బాగుంటుందని ఆశిస్తారు. ఇలాంటి ప్రాజెక్టును పర భాషా దర్శకుడికి.. అది కూడా ఓ చిన్న సినిమా తీసిన వ్యక్తికి ఇవ్వడం సరైన నిర్ణయమేనా అనిపిస్తోంది. మరి నాగ్ ఆలోచన ఎలా ఉందో?