టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన సమంత రూత్ ప్రభు–నాగచైతన్యల విడాకుల విషయంపై కొద్ది నెలల క్రితం తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరూ అధికారికంగా విడాకుల గురించి ప్రకటించకముందే రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఇక, వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ఫలానా కారణంతోనే విడిపోయారంటూ సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో రకరకాల కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే తనపై దుష్ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ చానెళ్లపై సమంత కోర్టుకు వెళ్లింది కూడా. ఆ ఛానెళ్లపై వేసిన కేసులో సమంతదే పైచేయి.
అయితే, ఆ కేసు గెలిచిన తర్వాత కూడా నాగచైతన్య–సమంతల విడాకులపై చాలా యూట్యూబ్ ఛానెళ్లలో రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ పుకార్లపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. తొలిసారి సమంత-నాగ చైతన్యల విడాకులపై స్పందించిన నాగ్…ఆ ఛానెళ్లపై ఫైర్ అయ్యారు.
కావాలనే కొందరు ఇలాంటి చెత్త ప్రచారాలు చేస్తున్నారని, వారి విడాకులపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని నాగ్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ చానెళ్లలో అలాంటి వాటికి కొదవ లేకుండా పోయిందని నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఇలాంటి చెత్త ప్రచారాలు చేసినా పట్టించుకోలేదని, పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు అని పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. కానీ, తన కుటుంబం గురించి అలాంటి చెత్త కథనాలు ప్రసారం చేసే సరికి బాధపడ్డానని నాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను ఆ కథనాలను పట్టించుకోనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. సమంత విడాకులపై నాగ్ ఫస్ట్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.