సమంత నుంచి విడిపోయాక రెండేళ్లు సింగిల్గానే ఉండిపోయాడు నాగచైతన్య. కానీ తర్వాత శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు ఈ జంట పెళ్లి వైపు అడుగులు వేస్తోంది. మొదట్లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ అంటూ వార్తలు వస్తే జస్ట్ రూమర్స్ అనుకున్నారు చాలామంది. కానీ తర్వాత అదే నిజమని తేలింది. విశేషం ఏంటంటే.. చైతూ, శోభిత మధ్య ప్రేమకు వారధిగా నిలిచింది చైతూ తండ్రి నాగార్జుననేనట.
తాజాగా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంలో శోభిత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అప్పటికే బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించిన ఈ తెలుగమ్మాయి.. తెలుగులో నటించిన తొలి చిత్రం అదే. ఆ సినిమాలో తన పెర్ఫామెన్స్ చూసి ఇంప్రెస్ అయి.. తర్వాత హైదరాబాద్కు వచ్చినపుడు తనను కలవమని శోభితకు చెప్పినట్లు నాగ్ వెల్లడించాడు.
అలా తాను శోభితను కలిశానని.. ఆమెతో సినిమాల గురించే కాక అనేక అంశాల మీద చాలా మాట్లాడానని.. తనతో మాట్లాడ్డం బాగా అనిపించిందని.. తర్వాత మరో సందర్భంలో కలిసినపుడు చైతూ కూడా తన వెంట వచ్చాడని.. ఆపై ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారని నాగ్ వెల్లడించాడు. ఈ విధంగా చైతూ-శోభిత మధ్య ప్రేమకు మధ్యవర్తిగా నిలిచింది తానే అని నాగ్ తెలిపాడు. చైతూ-శోభితల బంధం తనకెంతో ఆనందాన్నిచ్చే విషయమని నాగ్ చెప్పాడు.
శోభిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని.. వైజాగ్ నుంచి వచ్చి బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించడం మామూలు విషయం కాదని.. ఆమె మంచి పెర్ఫామర్ అని.. ఎంత ఎదిగినా కూడా తన సంప్రదాయాలకు ఆమె ఇచ్చే విలువ తననెంతో ఆకట్టుకుంటుందని నాగ్ తనకు కాబోయే కోడలి మీద ప్రశంసల జల్లు కురిపించాడు. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలోనే చైతూ-శోభితల పెళ్లి జరగబోతోంది.