మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
చిరంజీవి బ్రోకర్ అని, చిల్లర బేరగాడని, ఊసరవెల్లి లాంటివాడని, అటువంటి చిరంజీవిని భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదిక మీదకు పిలవడం ఏమిటని నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేకాదు, చిరంజీవి వంటి చిల్లర గాళ్లను పిలిచి బీజేపీ పరువు పోగొట్టుకుందని షాకింగ్ కామెంట్లు చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ వంటివాడని, అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని, పవన్ రాజకీయ అస్పష్టత వీడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, నారాయణపై మెగా ఫ్యాన్స్, జనసైనికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నారాయణ వ్యాఖ్యలపై మెగాబ్రదర్ నాగబాబు నిప్పులు చెరిగారు. సీపీఐ నారాయణ వంటి కొంతమంది తెలివి తక్కువ వారు చేసిన వెర్రి వ్యాఖ్యలపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పరోక్షంగా నారాయణకు చురకలంటించారు.
సీపీఐ నారాయణ చాలాకాలం నుంచి అన్నం తినడం మానేశారని, కేవలం ఎండుగడ్డి, చెత్తా చెదారం తింటున్నాడని విమర్శించారు. నారాయణ చేత గడ్డి తినడం మాన్పించి కాస్త అన్నం పెట్టే కార్యక్రమం చేపట్టాలని మెగా అభిమానులు, జన సైనికులకు నాగబాబు పిలుపునిచ్చారు. అలా చేస్తేనైనా నారాయణ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడేమోనని నాగబాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి, నాగబాబు కామెంట్లపై నారాయణ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.