హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు వేదిక పైకి వచ్చారు. అయితే ఈ సందర్భంగా కార్యక్రమం దృష్టి అంత చిరంజీవి ఫోటో సెషన్ పై ఉండడంతో గరికపాటి అసహనానికి లోనయ్యారు.
ఈ క్రమంలోనే చిరంజీవి ఫోటో షూట్ ఆపేయావాలని, లేకపోతే తాను అక్కడి నుంచి వెళ్ళిపోతానని గరికపాటి హెచ్చరించారు. గరికపాటి చెప్పిన వెంటనే ఫొటో షూట్ ఆపేసిన చిరు…తన సీట్లోకి వచ్చి కూర్చున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా గరికపాటి, చిరంజీవి ఇద్దరు సరదాగా సంభాషించుకున్నారు. దీంతో, ఆ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఆ వ్యవహారంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం చర్చనీయాంశమైంది.
ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటి అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగబాబు తన ట్వీట్ లో పాటి అని పదేపదే ప్రస్తావించడం గరికపాటిని ఉద్దేశించినదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చిరుకు బదులుగా నాగబాబు స్పందించారని అనుకుంటున్నారు. చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, గరికపాటిని ఉద్దేశించి పరోక్షంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
మరోవైపు, కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు polish తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వేల్యూ ఎప్పుడు తగ్గదు. సరైన polish (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లుగొలిపే వెలుగుని తట్టుకోవటం కష్టం అంటూ గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఉద్దేశించి నాగబాబు మరో ట్వీట్ చేశారు.