ఏపీలో మంత్రి పదవుల పందేరం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క మంత్రి పదవి దక్కిన వారు సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే…అర్హత ఉండి కూడా సామాజిక సమీకరణాలు, జగన్ లెక్కల కారణంగా పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో వైరాగ్యంలో మరికొందరు కూరుకుపోయారు. ఇక, ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు కన్నీరు మున్నీరు కాగా…మరికొందరు తమ అనుచర గణంతో ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు.
ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, మంత్రి పదవి దక్కని వారిపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు పంచ్ లు వేశారు. ‘వైసీపీ మంత్రులకు నా మనవి’ అంటూ నాగబాబు సెటైర్లు వేశారు. మంత్రి పదవులు రానివారి, మంత్రి పదవులు పోయిన వారి ఫ్రస్ట్రేషన్, బాధ, కుమిలిపోవడం, కొంతమంది కన్నీరు పెట్టుకోవడం చూస్తే తనకూ బాధేసిందని, అయ్యో పాపం అనిపించిందని నాగబాబు అన్నారు. అయితే, పదవుల కోసం ఏడుస్తున్న, బాధపడుతున్న వైసీపీ నేతలకు నాగబాబు చురకలంటించారు.
అదే రీతిలో, కౌలు రైతుల ఆత్మహత్యలు, ఇతర ఉత్పత్తి కులాల్లో చనిపోయిన ప్రజలు, ఉద్యోగాలు రాని యువత, రాజధాని ప్రజల కడుపుమంట, ఉద్యోగులు పడుతున్న బాధలు, నాశనం అయిపోయిన మౌలిక సదుపాయాలు, ఆ సదుపాయాల్లేక నిత్యం చస్తున్న ప్రజలు (లిస్ట్ చాంతాడంత ఉంది లెండి), వారు పడుతున్న బాధలపైనా ఇదే కన్నీరు, ఫ్రస్ట్రేషన్, బాధ, ప్రేమ చూపిస్తే బాగుంటుందని విమర్శించారు. మాజీ మంత్రుల పుండు మీద కారం చల్లినట్లున్న నాగబాబు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.