సగటు రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగిన ‘మా’ ఎన్నికలు ముగిశాయి. గడిచిన కొద్ది కాలంగా హాట్ టాపిక్ గా మారి.. చానళ్లకు తగినంత మేతను అందించిన ‘మా’ ఎన్నికల హడావుడి ఆదివారం రాత్రితో ముగిసింది. అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ శాతం.. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఆయనపై పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమిపాలయ్యారన్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు పూర్తై.. విజేతను ప్రకటించిన కాసేపటికే మెగా కాంపాండ్ కు చెందిన కీలకమైన నాగబాబు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ‘ప్రాంతీయవాదం.. సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగటం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్ లో ‘నా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.. సెలవు అంటూ ట్వీట్ చేశారు.
ట్వీట్ తో పాటు ఒక ఇమేజ్ ను జత చేసిన ఆయన అందులో ‘పీఎస్’ అంటూ చివర్లో.. ‘‘ఇది నేను ఎంతగానో ఆలోచించి.. ప్రలోభాలకుఅతీతంగా నా పూర్తి చిత్తశుద్దితో తీసుకున్న నిర్ణయం’’గా ఆయన పేర్కొనటం గమనార్హం.
రానున్న 48 గంటల వ్యవధిలో తన రాజీనామా లేఖను ‘మా’ కార్యాలయానికి పంపుతున్నట్లుగా ఆయన ప్రకటించారు.
నాగబాబు ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని.. అలాంటిది ఓడినంతనే.. ఇలాంటి వ్యాఖ్య చేసి తప్పుకోవటం మంచిది కాదన్న మాట కొందరి నోటి నుంచి వినిపిస్తే.. మరికొందరు మాత్రం నాగబాబు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
‘మా’ ఎన్నికల సందర్భంగా ఎన్నో విపరీతమైన పోకడల్ని చూశామని.. అలాంటప్పుడు తన మనసుకు అనిపించింది చెప్పి రాజీనామా చేయటం తప్పేం కాదన్న మాట వినిపించటం గమనార్హం.