కథానాయకుడు నాగశౌర్య కొన్నేళ్ల కిందట నిర్మాణంలోకి అడుగు పెడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. హీరోగా ఇంకా స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేదు, మార్కెట్ పెంచుకోలేదు.. ఇంతలో ప్రొడక్షన్ అవసరమా అన్నారు. కానీ సొంత బేనర్ ఐరా క్రియేషన్స్‌లో చేసిన ‘ఛలో’ సినిమాతోనే అతడి రాత మారింది. స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. మార్కెట్ పెంచుకున్నాడు.
అప్పట్నుంచి ఆపకుండా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఇప్పటికే సొంత బేనర్లో అతను మూడు సినిమాలు చేసేయడం విశేషం. ఈ మధ్యే ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌లో శౌర్య కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అది త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
ఐతే ఇంతలోనే నాగశౌర్య తల్లిదండ్రులు మరో కొత్త బేనర్ మొదలుపెట్టడం విశేషం. దాని పేరు ఐరా సినిమాస్. టాలీవుడ్లో పెద్ద బేనర్లో పెద్ద చిత్రాలు నిర్మిస్తూనే.. చిన్న, మీడియం రేంజ్ సినిమాల కోసం.. తమ ఫ్యామిలీ హీరోలతో కాకుండా బయటి వాళ్లతో సినిమాలు చేయడం కోసం, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం కోసం వేరే బేనర్లు పెట్టడం తెలిసిన సంగతే.
అదే తరహాలో నాగశౌర్య ఫ్యామిలీ ‘ఐరా సినిమాస్’ను ఆరంభించింది. తమ బ్యానర్ ద్వారా కొత్త నటీనటులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తామని శౌర్య ఫ్యామిలీ అంటోంది. అభినవ్ సర్దార్ అనే మరో నిర్మాతతో కలిసి ఐరా సినిమాస్ కొత్త సినిమాను ప్రకటించింది.
సన్నీ కోమలపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇదొక థ్రిల్లర్ మూవీ అట. ఐతే ఇంకా నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలు వెల్లడించలేదు. నాగశౌర్య స్థాయికి ప్రొడక్షన్లోకి దిగడమే ఆశ్చర్యమంటే ఇలా మరో బేనర్ పెట్టి కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తామనడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఈ ప్రయత్నంలో అతడి ఫ్యామిలీ ఏమేర విజయవంతం అవుతుందో చూడాలి.