యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఓ ఇంటివాడు అయ్యాడు. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ఏడడుగులు వేసి మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. దాదాపు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న చై-శోభిత.. పెద్దల అంగీకారంతో భార్య భర్తలు గా ప్రమోట్ అయ్యారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో అచ్చ తెలుగు సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
ఈ వేడుకకు అక్కినేని, దగ్గుబాటి, శోభిత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు సినీ పరిశ్రమ నుంచి కే. రాఘవేంద్రరావు, రాజమౌళి, అశ్వనీదత్, అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అడివి శేష్, కీరవాణి తదితరులు హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు.
పెళ్లి ఫోటోలను నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. చై, శోభితలు కలిసి అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం తమకు ఎంతో ప్రత్యేకమైన క్షణమని, శోభితను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని నాగార్జున ఈ సందర్భంగా తెలిపారు.
అలాగే శతజయంతికి గుర్తుగా స్థాపించిన ఏఎన్ఆర్ విగ్రహం వద్ద ఈ వేడుక జరగడం మరింత ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మనతో ఉన్నట్లు అనిపిస్తుందని నాగార్జున తెలిపారు.
ఇక చై-శోభిత పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. కొత్త జంటకు అభిమానులు మరియు నెటిజన్లు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. కాగా, నాగార్జున రెండో కుమారు అఖిల్ కు సైతం ఇటీవలె నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే ప్రముఖ చిత్రకారిణి జైనబ్ రావ్జీతో కలిసి అఖిల్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు.