కడప జిల్లాలో జేఎస్ డబ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్ నిర్మించనుందని, ఆ సంస్థ దాదాపు 8 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుందని సీఎం జగన్ అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ ఆ సంస్థ పెట్టుబడుల వ్యవహారానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే, ఆల్రెడీ ఈ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామంటూ వచ్చిన రెండు కంపెనీలను కాదని జేఎస్ డబ్ల్యూకే ఆ ప్రాజెక్టు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు గుప్పించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆ సంస్థకే దక్కడం వెనుక జగన్నాటకం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం ఆల్రెడీ ఇద్దరు కృష్ణులు వచ్చి వెళ్లారని, ఇప్పుడు మూడో కృష్ణుడిని జగన్ తెర ముందుకు తెచ్చారని ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ను మూడేళ్లలో ప్రారంభిస్తామని, 25 వేల మందికి ఉపాధి కల్పిస్తామని జగన్ మూడేళ్ల క్రితం పెద్దపెద్ద మాటలు చెప్పారని, కానీ, మూడేళ్లు గడిచినా…పునాది రాయి కూడా పెట్టలేదని విమర్శించారు.
రాయలసీమ నుంచి వలసలు నివారిస్తామన్న జగన్…కేబినెట్ భేటీలో మాత్రమే కనిపిస్తోన్న కొత్త పరిశ్రమను తీసుకువచ్చినట్లు హంగామా చేస్తున్నారని విమర్శించారు. మొదట లిబర్టీ ఎస్సార్ స్టీల్స్ అనే కృష్ణుడు రూ.17 వేల కోట్ల పెట్టుబడులు పెడతామన్నారని, స్విట్జర్లాండ్ కు చెందిన రెండో కృష్ణుడు రూ.12 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్నాడని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.8 వేల కోట్ల పెట్టుబడులు అంటూ మూడో కృష్ణుడిగా జేఎస్ డబ్ల్యూ కంపెనీ వచ్చిందని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టు ఇన్ని కంపెనీల చేతులు మారడానికి, నిర్మాణంలో జాప్యానికి గల కారణాలను ప్రజలకు జగన్ చెప్పాలని నిలదీశారు. ఇక, కడప స్టీల్ ప్లాంట్ కోసం కృష్ణపట్నం పోర్టులో ఒక బెర్తు కేటాయించారని, ఆ బెర్త్ ఎవరికి అమ్మేశారో చెప్పాని నాదెండ్ల ప్రశ్నించారు. అంతేకాదు, దాని వెనుక జరిగిన జగన్నాటకాన్ని ప్రజలకు జగన్ వివరించాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.