టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి.. మైత్రీ మూవీ మేకర్స్. సినిమాల క్వాంటిటీ, క్వాలిటీ, రేంజ్ పరంగా ప్రస్తుతం మైత్రీని కొట్టే సంస్థ మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది ‘పుష్ప-2’ భారీ విజయాన్నందుకుంది మైత్రీ. ఆ బేనర్ నుంచి రాబోతున్న తర్వాతి భారీ చిత్రం అంటే.. గుడ్ బ్యాడ్ అగ్లీనే. తెలుగులో ఒక స్థాయి అందుకున్నాక వేరే భాషల్లో కూడా అడుగు పెడుతున్న మైత్రీ.. ఇప్పటికే మలయాళంలో ‘ఏఆర్ఎం’ అనే భారీ చిత్రాన్ని నిర్మించి సక్సెస్ సాధించింది. హిందీలోకి ‘జాట్’ మూవీతో ప్రవేశిస్తోంది.
ఇక తమిళంలో మైత్రీ ఎంట్రీ మామూలుగా ఉండబోదని ఇప్పటికే అర్థమైపోయింది. అక్కడి టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే భారీ చిత్రాన్ని నిర్మించింది మైత్రీ సంస్థ. ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఐతే సంక్రాంతి మిస్ అయినప్పటికీ వేసవిలో అదిరిపోయే డేట్ ఎంచుకున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే సినిమాకు ఒక రేంజ్ హైప్ ఉండగా.. లేటెస్ట్గా రిలీజ్ చేసిన టీజర్‌తో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అజిత్ ‘విశ్వాసం’ తర్వాత సరైన మాస్ సినిమా చేయలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. ఇమేజ్‌కు భిన్నంగా ప్రయత్నించడం మంచిదే కానీ.. ఆ క్రమంలో ‘విడాముయర్చి’ లాంటి డిజాస్టర్ చేసేసరికి అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. అజిత్ మాస్ సినిమాలకే పరిమితం కావాలని, ఫ్యాన్ మూమెంట్స్ మీద దృష్టిపెట్టాలని వాళ్లు నొక్కి వక్కాణిస్తున్నారు. వాళ్ల ఆకలి తీర్చే సినిమాలాగే కనిపిస్తోంది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.
‘మార్క్ ఆంటోనీ’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. అతను అజిత్‌కు వీరాభిమాని. ఒక అభిమాని కోణంలో ఆలోచించి వాళ్లకు కావాల్సిన మూమెంట్సే అందించినట్లున్నాడు ఈ చిత్రంలో ఆధిక్. ‘విడాముయర్చి’ డిజాస్టర్ అయినా సరే.. దాని ఎఫెక్ట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మీద ఏమాత్రం పడలేదు. దీనికి బిజినెస్ ఆఫర్లు ఒక రేంజిలో వచ్చాయట. మైత్రీ సంస్థకు ఈ చిత్రం భారీ లాభాలే తెచ్చిపెడుతున్నట్లు సమాచారం. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. అజిత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ పడడం, కోలీవుడ్ కలెక్షన్ల రికార్డులు బద్దలు కావడవ ఖాయం.