నెల్లూరు వైసీపీలో లకులకలు పార్టీకి చేటు కలిగించేలా ఉన్నాయని టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. నెల్లూరు వైసీపీలోని కీలక నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో ప్రవర్తిస్తున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. తనకు మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉండడం, తన ఫోన్ ట్యాపింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఇక, తన నియోజకవర్గానికి సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేకపోతున్నానని సీనియర్ పొలిటిషియన్, నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పలుమార్లు మీడియా ముందు బహిరంగంగానే తన అసహనాన్ని వెళ్ళగక్కారు.
ఈ క్రమంలోనే తాజాగా సొంత పార్టీపై ఆనం కూడా కోటం రెడ్డి తరహాలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. గత ఏడాదిన్నరగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా వాట్సాప్ కాల్స్ చేయాల్సి వస్తోందని ఆనం వాపోయారు. తమ పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తుంటే తాను ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ ఆనం ప్రశ్నించారు. తనకు ఇప్పటికే భద్రతను తగ్గించారని… పూర్తిగా భద్రతను తొలగించాలని కోరుతున్నానని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
వెంకటగిరిలో రాజకీయ అనిశ్చితి ఉందని, రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలడం సరికాదని ఆనం వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని ఆయన అన్నారు. ఈలోపు ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని ఆనం షాకింగ్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేసే పోకడలు గతంలో లేవని, తనకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపై తన రాజకీయ జీవితం ఆధారపడి లేదని ఆనం చేసిన వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాలను కుదిపేస్తున్నాయి.