తెలంగాణలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ మ్యాటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎంపీ బండి సంజయ్ అరెస్టు కావడం, ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఆయన బెయిల్ పై విడుదల కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక, తాజాగా తన ఫోన్ పోయిందంటూ బండి సంజయ్ ఆరోపించడం, ఆ ఫోన్ కేసీఆర్ దగ్గరే ఉందంటూ షాకింగ్ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
అరెస్ట్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగిందని, ఆ గందరగోళంలో తన ఫోన్ పోయిందని బండి సంజయ్ అంటున్నారు. అంతేకాదు, తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఆయన ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఫోన్ కేసీఆర్ వద్ద ఉందని, తన ఫోన్ కాల్ డేటా చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయారని బండి సంజయ్ అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తనకు కాల్స్ చేసిన విషయం చూసి కేసీఆర్ కు నిద్రపట్టడంలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ పై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. బండి సంజయ్ తన ఫోన్ అప్పగించడంలేదని, విచారణకు సహకరించడంలేదని కోర్టుకు అడ్వకేట్ జనరల్ విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది.