జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించాల్సి వచ్చినపుడల్లా ఆయన పెళ్లిళ్ల వ్యవహారాన్నే తెరపైకి తెస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కార్లు మార్చినట్లు పెళ్లాలను మారుస్తుంటాడని ఆయన పవన్‌ను ఎద్దేవా చేస్తుంటారు. పవన్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లే అయినప్పటికీ.. ఆయనకు నలుగురు పెళ్లాలు అని మాట్లాడేస్తుంటారు జగన్.
ఈ విషయమై ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొన్ని కౌంటర్లు వేశాడు. తాను పాలసీల గురించి మాట్లాడితే జగన్ పెళ్లిళ్ల గురించి ఎత్తుతాడని ఆయన తరచుగా వ్యాఖ్యానిస్తుంటారు. ఐతే తెలుగుదేశం, జనసేన పొత్తు నేపథ్యంలో ఏర్పాటు జెండా సభలో పవన్.. తన పెళ్లిళ్ల గురించి జగన్ చేసే వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చాడు.
జగన్ మాటకు ముందు తనకు నాలుగు పెళ్లిళ్లు అయినట్లు మాట్లాడుతుంటాడని.. తన నాలుగో పెళ్లాం జగనేమో తెలియదు అని పవన్ వ్యాఖ్యానించగా ఆడిటోరియం ఈ కామెంట్‌కు హోరెత్తిపోయింది. సందట్లో సడేమియా అన్నట్లు మూడు పెళ్లిళ్లను కాస్తా నాలుగుగా మార్చేస్తున్న వారికి పవన్ గట్టి కౌంటరే ఇచ్చాడు. ఇక ఈ సభ చివర్లో జగన్‌కు పవన్ ఇచ్చి వార్నింగ్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.
జగన్‌ను అథఃపాథాళానికి తొక్కుతానని.. లేదంటే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని.. తన పార్టీ జనసేన కాదని పవన్ తీవ్ర ఆవేశంతో అన్నాడు. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసైనికులకు పవన్ ఒక విన్నపం చేశాడు. ఇచ్చిన 24 సీట్లలో గెలిచేందుకు కృషి చేయాలని.. తనను నమ్మాలని.. వ్యూహం తనకు వదిలేసి పని చేయాలని పవన్ కోరాడు. తనకు ఉన్నదల్లా వెనకుండి నడిపించే జనసైనికులే అంటూ ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు.