వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థుల మీద ఆ పార్టీ నేతలు మాటల దాడి చేయడమే తప్ప.. వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం చాలా తక్కువ అనే చెప్పాలి. జిల్లా స్థాయిలో అంతర్గత విభేదాలు మామూలే కానీ.. రాష్ట్ర స్థాయి నేతలు బహిరంగంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, పార్టీకి డ్యామేజ్ చేయడం లాంటి ఉదంతాలు దాదాపు కనిపించవు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆ పార్టీలో అంతర్యుద్ధాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
వైజాగ్‌కు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అయినప్పటికీ.. ఆ ప్రాంతం మొత్తాన్ని మూడేళ్ల పాటు తన గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం నడిపిన విజయసాయి ఇప్పుడు అక్కడ ప్రాధాన్యం కోల్పోవడం… ఆయన భూ దందా గురించి వార్తలు బయటికి రావడం కథను మలుపు తిప్పేలా ఉంది. తన భూ దందా గురించి ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ కూర్మనపాలెంలో భూ యజమానులకు కేవలం ఒక్క శాతం మాత్రమే వాటా ఇచ్చి 99 శాతం వాటా తీసుకుని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టిని అటు మళ్లించాడు విజయసాయి.
వెంటనే ‘ఈనాడు’ సాయిరెడ్డి సౌజన్యంతో అంటూ ఎంవీవీ మీద కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఎంవీవీ స్పందిస్తూ.. తన మీద వచ్చిన కథనం గురించేమీ మాట్లాడలేదు. విజయసాయి మీదికి రివర్స్ పంచ్ వదిలాడు. ముందు విజయసాయి తన మురికిని కడుక్కోవాలంటూ కొంచెం ఘాటుగానే వ్యాఖ్యానించాడు. అంతే కాక.. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించిన విజయసాయి.. ఇప్పుడు కుమార్తెతో చేయించింది ఏంటి అని ప్రశ్నించారు. ఇది విజయసాయికే కాక మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ నిబద్ధతనే ప్రశ్నించే మాట. చూస్తుంటే ఈ గొడవ వైకాపాలో పెద్ద దుమారానికి దారి తీసి, ఆ పార్టీకి బాగానే నష్టం చేసేలా కనిపిస్తోంది.