తెలంగాణలో ఏకంగా ఓ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగిన ఘటన పెను దుమారం రేపింది. ఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసేందుకు వచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జీవన్ రెడ్డి నివాసంలోకి ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి చొరబడ్డాడు.
జీవన్‌రెడ్డి ఇంట్లోని ధర్డ్ ఫ్లోర్‌లోకి వెళ్లిన నిందితుడు ఎమ్మెల్యే బెడ్రూం డోర్ తీశాడు. ఆ సమయంలో జీవన్‌రెడ్డి మేల్కొని ఉండి కేకలు వేయడంతో అలెర్టయిన నిందితుడు అక్కడి నుంచి బయటకు పరిగెత్తాడు. అయితే ఇంట్లో నుంచి పరుగెత్తుతున్న ప్రసాద్ గౌడ్‌ను జీవన్‌రెడ్డి సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.
ప్రసాద్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి రెండు ఎయిర్ పిస్టల్స్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రసాద్ గౌడ్…మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య భర్తగా గుర్తించారు. లావణ్యను సర్పంచ్ పదవి నుంచి జీవన్ రెడ్డి సస్పెండ్ చేశారన్న అక్కసుతోనే ఆయనపై కక్ష పెంచుకున్నాడని తెలుస్తోంది. ప్రసాద్ గౌడ్ ను పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
గతంలో కూడా జీవన్ రెడ్డికి, ప్రసాద్ గౌడ్ కి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆయన నుంచి కూడా మరికొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, జీవన్ రెడ్డి ఇంటి దగ్గరకు ప్రసాద్ గౌడ్ ఒక్కడే వచ్చాడా ? ఇంకా ఎవరైనా వచ్చారా..? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. గన్స్ కొనేందుకు ప్రసాద్ గౌడ్ తన ఫోన్ లో చేసిన చాటింగ్ ను పోలీసులు గుర్తించారు.
కాగా, టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు నామా పృథ్వి తేజను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 31న షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కారును ఆపి, అందులోకి ఎక్కిన దుండగులు… ఆయనను కత్తితో బెదిరించి రూ. 75 వేలు దోచుకున్నారు. నిన్న రాత్రి పంజాగుట్ట పోలీసులకు తేజ సిబ్బంది ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.