సీఎం జగన్ హయాంలో వైసీపీ నేతలకు భయం, భక్తి లేకుండా పోయాయని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ పై హత్యారోపణలు రావడం కలకలం రేపింది. ఎమ్మెల్సీ ఉదయ్ కారులో ఆయన డ్రైవర్ మృతదేహం ఉండటం సంచలనం రేపింది. ఆ డ్రైవర్ ను హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కారులో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం ఉంది. ఆయనే తన కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు యత్నించారు. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని అతడి తమ్ముడికి సమాచారమిచ్చారు. డెడ్ బాడీని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కారులో తీసుకొచ్చి వారికి అప్పగించేందుకు ప్రయత్నించారు.
అయితే మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో డెడ్ బాడీ ఉన్న కారు అక్కడే వదిలి మరో కారులో ఉదయ్ వెళ్లిపోయారు. తన కొడుకును గురువారం ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ తీసుకెళ్లారని సుబ్రమణ్యం తల్లిదండ్రులు చెబుతున్నారు. తన కొడుకును హత్య చేశారని వారు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కొట్టి చంపి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. డెడ్ బాడీని ఎమ్మెల్సీ ఇంటికి ఎలా తీసుకువస్తారని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు కదా అని ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఉదయ్ దగ్గర సుబ్రమణ్యం డ్రైవర్ గా పని చేస్తున్నారని అతడి బంధువులు చెబుతున్నారు. అయితే, ఉదయ్ సన్నిహితురాలితో డ్రైవర్ సుబ్రహ్మణ్యం అక్రమ సంబంధం నేపథ్యంలోనే అతడిని కడతేర్చారని విమర్శలు వస్తున్నాయి.