టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి నుంచి 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలుపు గుర్రం ఎక్కిన మాజీ పార్లమెంటేరియన్.. మాగం టి మురళీ మోహన్.. ఏకంగా రాజకీయాలకు స్వస్తి చెప్పేస్తున్నారు. సుదీర్ఘ కాలం ఆయన రాజకీయాలకు మద్దతుగా ఉన్నారు. అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా టీడీపీకి మద్దతుదారుగా వ్యవహరిస్తున్న మాగంటి.. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు నుంచి రాజమండ్రి టికెట్ సంపాయించుకుని బరిలో నిలిచారు.
వాస్తవానికి 2009లోనే పోటీ చేసినా.. ఓడిపోయారు. అయితే.. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో .. ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకొంటు న్నట్టు చెప్పేశారు.
సినీ రంగం నుంచి వచ్చిన వారిలో సక్సెస్ అయిన నాయకుడిగా మురళీ మోహన్‌కు పేరుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం సహా సినీరంగంలో హీరోగా, నిర్మాతగా, స్టూడియో వ్యాపారాలు చేస్తున్న మురళీ మోహన్ ఇంత సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి? అనేది కీలకంగా మారింది. కొన్నాళ్ల కిందట.. బాగానే ఉన్న ఆయన.. మళ్లీ టీడీపీ పుంజుకుంటుందని.. తాను కూడా త్వరలోనే రంగంలోకి దిగుతానని.. ఆన్లైన్ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే.. ఇప్పుడు సడెన్‌గా తాను పూర్తిగా రాజకీయాలకు దూరమవుతున్నట్టు ప్రకటించారు. అయితే.. మురళీ మోహన్ ప్రకటన వెనుక.. తీవ్ర నిరాశ, నిస్పృహ ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
టీడీపీకి ఆది నుంచి మద్దతుగా ఉన్న మురళీ మోహన్‌కు చంద్రబాబు అన్ని విధాలా సహకరిస్తున్న మాట వాస్తవం. 2009లో రాజమండ్రి నుంచి ఓడిపోయినప్పటికీ.. మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇక, ఎంపీగా ఉంటూ.. ఆశించిన మేరకు పెర్ఫార్మెన్స్ చూపించకపోయినా.. సర్దుకు పోయారు.
2019 ఎన్నికల్లో మురళీ మోహన్ కొరిక మేరకు ఆయన కోడలు.. రూపాదేవికి అవకాశం ఇచ్చారు. నిజానికి ఆమె ఓడిపోతుందని తెలిసి కూడా మురళీ మోహన్ కోసం.. చంద్రబాబు కాదనలేక పోయారు. ఇక, గత ఏడాది మురళీ మోహన్ అనారోగ్యానికి గురైనప్పుడు.. కూడా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌లు.. ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు.
మరి ఇంత చేసినా.. మురళీ మోహన్.. పార్టీకి ఏం చేశారని ఆలోచిస్తే.. సమాధానం లభించదు. మొత్తానికి టీడీపీని వాడుకుని వదిలేసిన వారి జాబితాలో మురళీ మోహన్ కూడా ఒకరా? అనే ప్రశ్నలు సీనియర్ల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.