భారత కుబేరుల జాబితాలో తెలుగోళ్లు సత్తా చాటుతున్నారు. ఉత్తరాదివారికి తామేమీ తక్కువ కాదని చాటి చెబుతున్నారు. తాజాగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ రిచ్‌లిస్ట్-2022 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తలు మంచి ర్యాంకులు సాధించారు. ఈ జాబితాలో మొత్తం 78 మంది తెలుగు బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. వారి సంపద విలువ రూ.3,90,500 కోట్లుగా ఉంది.
హైదరాబాద్‌కు చెందిన దివీస్ లెబొరేటరీస్ ప్రమోటర్ మురళీ దివి, ఆయన కుటుంబం తెలుగువారి జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే వారి సంపద 29 శాతం తగ్గింది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల కుబేరులలో మురళీ దివీకే అగ్రస్థానం దక్కింది. 2021లో రూ.79,000 కోట్లుగా ఉన్న వారి సంపద…ఇప్పుడు రూ.56,200 కోట్లకు చేరింది. ఇక, జాతీయ స్థాయి కుబేరుల జాబితాలో మురళీ దివి 6 స్థానాలు తగ్గి 14వ ర్యాంకులో కొనసాగుతున్నారు.
మరోవైపు, హెటెరో గ్రూప్ అధినేత బి.పార్థసారథి రెడ్డి తెలుగు కుబేరుల లిస్ట్ లో ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. గగ ఏడాది ఆయన సంపద రూ.26,100 కోట్లు కాగా…ఈ ఏడాది 50 శాతం వృద్ధితో రూ.39,200 కోట్లకు చేరింది. జాతీయ కుబేరుల జాబితాలో ఆయన 58వ స్థానం నుంచి 32వ స్థానానికి ఎగబాకారు. ఎంఎస్ఎన్ లెబొరేటరీస్ అధినేత ఎం.సత్యనారాయణ రెడ్డి రూ.16,000 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.
బయలాజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లా రూ.8700 కోట్ల (13% పెరుగుదల)తో టాప్-10లో నిలిచారు. టాప్-10లో ఉన్న ఏకైక మహిళ ఆమే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాలలోని కుబేరుల టాప్-10 లిస్ట్ లో ఆరుగురు ఫార్మా ఇండస్ట్రీకి చెందినవారే కావడం గమనార్హం. ఇక, జాతీయ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ తొలి స్థానంలో నిలిచారు.
ఫోర్బ్స్ రియల్‌టైమ్ రిచ్ లిస్టులో ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ…జాతీయ స్థాలో అగ్ర స్థానానికి ఎగబాకారు. ముకేశ్ అంబానీని అదానీ రెండో స్థానానికి నెట్టేశారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం గౌతమ్ అదానీ సంపద ఇప్పుడు రూ.10,94,400 కోట్లు. ముకేశ్ అంబానీ కన్నా రూ.3 లక్షల కోట్లు ఎక్కువ సంపద అదానీకి ఉంది.