కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్.. సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన కామెంట్లపై మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న పాల్వాయి స్రవంతి నిప్పులు చెరిగారు. వెంకటరెడ్డి `నమ్మక ద్రోహి` అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయనను ఏ పదజాలంతో ఎలా తిట్టాలో కూడా అర్ధం కావడం లేదన్నారు. ఎన్ని తిట్టినా.. ఆయన చేసిన ద్రోహం ముందు అవి సరిపోవని వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్లో గతంలో ఉన్న కొందరు నాయకుల గురించి.. వారు చేసిన ద్రోహాల గురించి విన్నాను. కానీ, వెంకటరెడ్డి.. గుండెలు తీసిన బంటు. దారుణమైన ద్రోహి.. ఇలాంటి వ్యక్తిని నమ్మడం.. కాంగ్రెస్ చేసిన తప్పు“ అని స్రవంతి నిప్పులు చెరిగారు.
తాజాగా ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. “సోదరిగా వెళ్లి అన్నా మీ ఆశీర్వాదం కావాలని ఎన్నోసార్లు కోరాను. సరేనన్నారు. ప్రచారం చేస్తానని.. ఖర్చు కూడా భరిస్తానని.. హామీ ఇచ్చారు. అంతేకాదు.. నీకు టికెట్ ఎందుకు రాదో నేను చూస్తానని అన్నారు. తీరా రంగంలోకి దిగాక నమ్మక ద్రోహం చేసేలా మాట్లాడటం బాధగా ఉంది“ అన్నారు. ధనబలానికి, ప్రజాస్వామ్యానికి మధ్య మునుగోడు ఉప ఎన్నిక పోరు జరుగుతోందని స్రవంతి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కంకణబద్ధులై పనిచేస్తున్న సమయంలో వెంకటరెడ్డి ఇలా చేశారని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి వెనుక జరుగుతున్న కుట్రలకు నిదర్శనమే ఈ సంఘటనలని చెప్పుకొచ్చారు. మహిళా అభ్యర్థికి అవకాశం వచ్చిందని అంతా మీ వెంటే ఉండి గెలిపిస్తామని చెప్పిన వెంకట రెడ్డి నీతిమాలిన పనిచేశారని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తాను ప్రచారం చేసినా.. ప్రయోజనం లేదని అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్.. టీఆర్ ఎస్, బీజేపీలను తట్టుకోవటం కష్టమని వ్యాఖ్యానించారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి.. అక్కడి అభిమానులతో తన అంతరంగాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా మునుగోడులో తాను ప్రచారం చేసినా స్రవంతికి 10 వేల ఓట్లు వస్తాయేమో కానీ గెలిచే అవకాశాల్లేవని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మెల్బోర్న్లో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో మునుగోడు ఎన్నికలు, ప్రస్తుత పరిణామాలపై వెంకట్రెడ్డి ముచ్చటించిన వీడియో జోరుగా వైరల్ అయింది. బీజేపీ ఈ వీడియోను ఇప్పటికే లక్ష మందికి ఫార్వార్డ్ చేసింది. ఈ నేపథ్యంలోనే స్రవంతి ఫైర్ అయ్యారు.