చైనా రాజధాని బీజింగ్‌ను భారత వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబై ఓవర్ టేక్ చేసేసింది. ఇప్పటికే జనాభాలోనూ భారత్ చైనాను అధిగమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ కోటీశ్వరుల స్థానంలో ముందున్న చైనా రాజధాని బీజింగ్‌ను ముంబై దాటేసింది. ఆసియా బిలియనీర్ క్యాపిటల్‌గా బీజింగ్‌కు ఉన్న హోదాను ముంబై దక్కించుకుంది. చరిత్రలో తొలిసారిగా బీజింగ్‌ను ముంబై వెనక్కు నెట్టింది.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం, ప్రస్తుతం 92 మంది బిలియనీర్లు ముంబైలో నివసిస్తున్నారు. ఈ సంపన్నులు తమ సంపదను నిరంతరం పెంచుకుంటున్నారు. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం, గత ఏడాది కాలంలో, ముంబై నగరంలో కొత్తగా 27 మంది బిలియనీర్లు తెరమీదికి వచ్చారు. బీజింగ్‌లో ఈ సంఖ్య 6 మాత్రమే. భారతదేశంలో పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్య దేశ పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక బలాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తించింది.
కొత్త బిలియనీర్ల సంఖ్య పరంగా చూస్తే.. భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ పేరు మొదటి స్థానంలో ఉంది. అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడుగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నుల జాబితాలో ముకేష్ అంబానీ పేరును చేర్చడం ద్వారా భారతదేశ ఆర్థిక ఆధిపత్యం మరోమారు స్పష్టమైంది.
గత ఏడాదిలో, అంబానీ సంపద 40 శాతం లేదా 33 బిలియన్ డాలర్లు పెరిగింది, 115 బిలియన్ డాలర్లకు చేరింది. మన రూపాయల్లో చెప్పుకుంటే, అంబానీ నికర విలువ రూ. 9.50 లక్షల కోట్లు.ఈ జాబితాలో ముకేష్ అంబానీ 10వ స్థానంతో టాప్-10లో ఉన్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. భారతదేశం, చైనా మధ్య సంపద వృద్ధి ధోరణులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. హురున్ నివేదిక ప్రకారం, గత ఏడాది కాలంలో, చైనాలోని 573 బిలియనీర్ల సంపద క్షీణించింది.
అదే సమయంలో భారతదేశంలో 24 మంది బిలియనీర్ల సంపదలో మాత్రమే తగ్గుదల కనిపించింది. ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశ మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 51 శాతం పెరిగింది. ముంబై సంపద కూడా 47 శాతం పెరిగితే బీజింగ్‌లో 28 శాతం తగ్గింది. దీనివల్ల, ఆసియా నగరాల్లో ముంబై స్థానం మరింత బలోపేతమైంది.