మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలె `ఆర్ఆర్ఆర్`తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతుండగానే మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు చరణ్ సద్ధమయ్యాడు. అదే `ఆచార్య`. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ మెగా మల్టీస్టారర్ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేశారు. మణిశర్మ స్వరాలు అందించారు.
సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య సినిమా విశేషాలతో పాటు తన ఇతర ప్రాజెక్ట్ ల గురించి కూడా ప్రస్తావించాడు.
అలాగే ఈ ఇంటర్వ్యూలో మరో మల్టీస్టారర్ చిత్రాన్ని సైతం కన్ఫామ్ చేశారు. ఇంతకీ రామ్ చరణ్ మల్టీస్టారర్ చేయబోయేది ఎవరితోనో కాదు.. ఆయన బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో. చరణ్ మాట్లాడుతూ.. `పవన్ కళ్యాణ్ బాబాయ్ తో కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నా.. ప్రస్తుతం మాకు సరిపడా కథ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.. సరైన కథ కుదిరితే మా కాంబో ప్రాజెక్ట్ వెంటనే స్టార్ట్ చేస్తాం. ఆ సినిమాను నిర్మించేది కూడా నేనే కావచ్చు` అంటూ మెగా అభిమానులకు ఓ తియ్యటి శుభవార్తను చెప్పారు.
దీంతో పవన్-చరణ్ ల ఇమేజ్ కు సరిపడే కథ త్వరగా కుదరాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు అరవై శాతం వరకు షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇది ఫినిష్ అయిన వెంటనే చరణ్ `జెర్సీ` డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.