సినీ పరిశ్రమ మీద ఎన్నడూ లేని స్థాయిలో వరాలు కురిపించేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. చిన్న సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్మెంట్, థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీల రద్దు, థియేటర్లలో ఎన్ని కావాలంటే అన్ని షోలు పెంచుకునే వెసులుబాటు లాంటి నిర్ణయాలు కచ్చితంగా సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసేవే. ఈ నిర్ణయాలతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది తప్ప.. వేరే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ వీటితో పాటే టికెట్ల రేట్లు పెంచుకునే సౌలభ్యాన్ని కల్పించారు కేసీఆర్.
మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీల్లో మాదిరి ఇక్కడ హైదరాబాదులోను టికెట్ల రేట్లు పెంచేస్తారట. అక్కడి నగరాల్లో మల్టీప్లెక్సుల్లో టికెట్ల రేట్లు చూస్తే కళ్లు తిరుగుతాయి. మినిమం రూ.200తో మొదలుపెట్టి రూ.400 దాకా టికెట్ల రేట్లుంటాయి. చాలా మల్టీప్లెక్సుల్లో మినిమం టికెట్ రేటు రూ.250 దాకా ఉంటుంది. మన దగ్గర రూ.150తో మొదలవుతుంది. మెజారిటీ మల్టీప్లెక్సుల్లో ఇదే రేటు ఉంటుంది.
కేసీఆర్ మాటల్ని బట్టి చూస్తే సింగిల్ స్క్రీన్లలో కూడా టికెట్ల రేట్లు పెంచే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం భారంగా మారిపోయి ఫ్యామిలీస్ థియేటర్లకు రావడం మానేశాయి. కరోనా కంటే ముందే జనాలు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు తీసుకుని థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్సుకు వెళ్లి ఒక సినిమా చూసే ఖర్చుతో ఏడాది సబ్స్క్రిప్షన్ వస్తుండటమే అందుక్కారణం. ఇక కరోనా టైంలో అయితే దాదాపు ప్రతి కుటుంబంలోనూ మేజర్ ఓటీటీల సబ్స్క్రిప్షన్లు తీసుకునే పరిస్థితి వచ్చింది.
ఈ ఒరవడి ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్ట ిమున్ముందు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే జనాల సంఖ్య ఇంకా తగ్గుతుందేమో అన్న సందేహాలున్నాయి. అలాంటిది ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచితే దాని దుష్ప్రభావం మరింత పడటం ఖాయం. కాబట్టి ప్రభుత్వం అనుమతించినా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని థియేటర్ల యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరించడం మంచిది.