జస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చా.. మళ్లీ ఎంట్రీ ఇచ్చా అన్న సినిమా డైలాగ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ఆసియా నెంబరు వన్ సంపన్నుడి స్థానానికి చేరుకున్నారు. కేవలం రెండు నెలల పాటు ఆయన ఆ స్థానానికి దూరమయ్యారు. గడిచిన రెండేళ్లలో అత్యధిక కాలం ఆసియా నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆయన.. కొద్ది రోజుల పాటు మాత్రం ఆ స్థానాన్ని మిస్ అయ్యారు.
తాజాగా అంబానీ సంపద విలువ 8000 కోట్ల డాలర్లుగా బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. అంతకు ముందు అగ్రస్థానంలో నిలిచిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ అధిపది జాక్ మా ను అధిగమించి ముకేశ్ ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గత డిసెంబరులో చైనాకు చెందిన నాంగ్ పూ స్ప్రింగ్ కంపెనీ అధిపతి జోంగ్ షాన్ షాన్ ఆసియా అపర కుబేరుడిగా అవతరించారు.
ఆయన సారథ్యంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థ విలువ ఒక్కసారిగా భారీగా పెరగటంతో ప్రథమ స్థానంలో నిలిచారు. అయితే.. ఈ వారంలో ఆయన షేరు విలువ 20 శాతం కోల్పోవటంతో ఆయన సంపద కూడా భారీ ప్రభావితమైంది. దీంతో.. ఆయన సంపద 7660 కోట్ల డాలర్లకు తగ్గింది. దీంతో.. ముకేశ్ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇంధనం.. టెక్.. ఇ కామర్స్.. వరకు అన్ని ముఖ్య రంగాలపై ఫోకస్ చేసిన ముకేశ్.. గత ఏడాది గూగుల్.. ఫేస్ బుక్ లాంటి సంస్థల్ని తన సంస్థ వాటాల్ని అమ్మటం ద్వారా భారీగా ప్రయోజనం పొందారు. తాజాగా ఆయన సంపద 8వేల కోట్ల డాలర్లకు చేరుకోవటం గమనార్హం.