పైకి జనసేనతో పొత్తు కొనసాగుతున్నా.. కడుపులో కత్తులు పెట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీతో ఎలా వ్యవహరించాలి?- ఇది కొన్నాళ్లుగా జనసేన నేతలను తీవ్రస్థాయిలో మథన పడేలా చేస్తున్న ప్రశ్న. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తమకు అవకాశం ఉండి కూడా తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. మేం గ్రేటర్ త్యాగం చేశాం కనుక.. మాకు తిరుపతిని వదిలేయండి! అని పవన్ అప్పట్లోనే షరతు పెట్టారు. దీనిపై బీజేపీ నాన్చుడు ధోరణి అవలంభిస్తూ.. `కమిటీ` ప్రతిపాదనను తెరమీదకి తెచ్చింది. దీనికి కూడా పవన్ సరే అన్నారు.
కమిటీ వేయండి.. టికెట్ పై తేల్చండి.! అని ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోనే చెప్పేశారు. అయితే.. ఈ విషయం కొనసాగుతుండగానే ఏపీ బీజేపీ నాయకులు.. తిరపతిలో అనధికార ప్రచారం ప్రారంభించే శారు. పార్లమెంటు స్థానానికి సంబంధించి ఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. వరుస పర్యటనలు చేసి.. సభలు కూడా పెట్టేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ.. అవకాశం వచ్చిన ప్రతి సభలోనూ సోము వీర్రాజు పిలుపునిస్తున్నారు. దీంతో జనసేనలో తీవ్ర గందరగోళంతోపాటు.. తర్జన భర్జన జరుగుతోంది.
అసలు బీజేపీ వైఖరి ఏంటి? అని నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి స్థానం విషయంలో టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హ్యాండిస్తే.. మనం ఏకంగా పొత్తుకు హ్యాండివ్వాలనే ప్రతిపాదనను చాలా మంది నాయకులు తెరమీదకి తెచ్చారు.
అయితే.. అత్యంత కీలకమైన పొత్తుపై ఎటూ తేల్చని.. పవన్.. ఇటీవల కాలంలో ఏపీలో మూడు చోట్ల పర్యటించినా..(గుడివాడ, తూర్పుగోదావరి, విజయవాడ) ఎక్కడా బీజేపీ విషయాన్ని కానీ, పొత్తుపై కానీ కామెంట్లు చేయలేదు. ఇక, ఇప్పుడు.. ఈ నెల 21న ఆయన తిరుపతి పర్యటనకు వస్తున్నారు. ఇదేదో.. సాదాసీదా పర్యటన కాదు.. ఇక్కడి పార్లమెంటు స్థానంపై చర్చించేం దుకు .. గెలుపు అవకాశాలను అంచనా వేసేందుకు, వ్యూహాత్మకంగా ప్రచారం ప్రారంభించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై మేధోమధనం చేయనున్నారు.
ఈ క్రమంలో .. పార్టీ నాయకులు.. పొత్తుపై ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి టికెట్ ఇవ్వకపోతే.. తర్వాత పరిణామాలను కూడా పవన్.. పార్టీ నేతలతో చర్చించి.. నిర్ణయాన్ని రిజర్వ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుంది.. 21న జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు..అనే విషయం ఇటు జనసేనలోను, అటు బీజేపీలోనూ చర్చనీయాంశాలుగా మారాయి.