ఏపీ పాలిటిక్స్‌లో కాపులు సెంటర్ పాయింట్‌గా మారిపోయారు. కాపుల మద్దతు విపక్షానికేనని దాదాపు తేలిపోవడంతో ఎలాగైనా అడ్డుకోవాలని అధికార పక్షం నానా తంటాలు పడుతోంది. అందులో భాగంగానే ముద్రగడలాంటి పాతకాపులను ప్రయోగిస్తోంది. చాలాకాలం సీరియస్ నేతగానే ముద్ర నిలబెట్టుకున్న ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం ద్వారంపూడికి మద్దతుగా పవన్ కల్యాణ్‌ను విమర్శించి కాపుల నుంచి ఆగ్రహం ఎదుర్కొంటున్నారు.
మరీ ముఖ్యంగా జనసేన నేతల నుంచి తీవ్రమైన నిరసనను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ముద్రగడతో కలిసి కాపు ఉద్యమంలో పాల్గొన్నామని.. అప్పట్లో ఆయన పెట్టిన ఉప్మా తిన్నామని, ఆ ఉప్మా ద్వారంపూడి స్పాన్సర్ చేసిందని ఇప్పటివరకు తెలియదని.. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆ ఉప్మా డబ్బులు తిరిగిచ్చేస్తామంటూ ముద్రగడకు మనీయార్డర్లు పంపుతున్నారు.
ముద్రగడ పద్మనాభం అడ్రస్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు వెయ్యి రూపాయల చొప్పున మనియార్డర్ పంపుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వందలాది మంది ఈ మనీయార్డర్లు చేయడానికి పోస్టాఫీసులకు వెళ్తుండడంతో పోస్టాఫీసులు కిటకిటలాడుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ఇటీవల ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో కాపు ఉద్యమానికి సహకరించారని ఆ లేఖలో ముద్రగడ తెగ ప్రశంసించారు. దీంతో కాపు ఉద్యమంలో ముద్రగడతో పనిచేసి తప్పు చేశామని.. అప్పట్లో తమకు తెలియక ఆయనతో ఉప్మా తిన్నామని జనసేన నేతలు అంటున్నారు. ఆ ఉప్మా స్పాన్సర్ చేసిన ద్వారంపూడికి డబ్బులు తిరిగి పంపాలంటూ ముద్రగడకు వేలాదిగా మనియార్డర్లు పంపుతున్నారు.
కాగా ముద్రగడ తీరు కాపుల్లో విపరీతంగా చర్చలో ఉంది. ఇంతకాలం కాపు కులంలో పెద్దమనిషిగా చాలామంది ఆయన్ను భావించినా తాజాగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించిన ఆయన లేఖ రాయడం, అందులో ఆయన ద్వారంపూడిని వెనకేసుకుని రావడంతో కాపు సంఘాలు, కాపు నేతలు, కాపు యువత నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాపు ఓట్లను చీల్చాలనుకుంటున్న శక్తులకు ముద్రగడ వంటివారు మద్దతివ్వడం ఏమాత్రం తగదని.. అలా చేస్తే కాపు ద్రోహిగా చరిత్రలో చెడ్డపేరు తెచ్చుకుంటారంటున్నారు.