“మీకు మాకు సెట్ అవ్వదు. టీడీపీలోకి అయినా జనసేనలోకి అయినా వెళ్తా.. కాదనుకుంటే ఇంట్లో అయినా ఖాళీగా కూర్చుంటా.. కానీ వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదు.. నన్ను కలిసేందుకు వచ్చి మీ సమయం వృథా చేసుకోవద్దు.. మీ పని మీరు చూసుకోండి.” తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో కాపు నేత ముద్రగడ పద్మనాభం చెప్పిన మాటలు. తాను వైసీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో జగన్ సహా వైసీపీ నేతలు ఖంగు తిన్నారు.
ఆఖరికి తోట త్రిమూర్తులును కనీసం కలిసేందుకు కూడా ముద్రగడ ఇష్టపడలేదట. చాలాకాలంగా తటస్థంగా ఉంటూ కాపుల సమస్యలపై పోరాడుతున్న ముద్రగడ రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ ఇప్పంచి రాజకీయాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుబెట్టేందుకు ముద్రగడ రెడీ అవుతున్నారని టాక్. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు ముద్రగడను కలిశారని తెలుస్తోంది. అంతేకాదు, త్వరలోనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి జనసేన అధినేత స్వయంగా వెళ్లి తమ కూటమికి మద్దతివ్వాలని, ఎన్నికల్లో పోటీ చేయాలని కోరబోతున్నారట.
ఆల్రెడీ కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు ఆయనతో ఈ విషయంపై చర్చలు జరిపారట. జనసేన నేతలు తనను కలిసిన విషయంపై ముద్రగడ మాట్లాడలేదు. అంతకుముందు, ఈ నెల 4న కాపునేతలకు పవన్0 లేఖ రాశారు. తనను కాపు పెద్దలు దూషించినా దీవెనలుగా స్వీకరిస్తానని అన్నారు. కాపులను వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేశారు. కాపునేతలకు జనసేన తలుపులు తెరిచే ఉంటాయని పవన్ చెప్పడంతో ముద్రగడ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.