హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో బీజేపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి గతంలో పలుమార్లు గళం విప్పిన సంగతి తెలిసిందే.
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో జరుగుతున్న వ్యవహారాలపై కూడా స్వామి గతంలో స్పందించారు. ఈ క్రమంలోనే నేడు తిరుమల వెంకన్నను దర్శించుకున్న స్వామి తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నానని, దేశంలో అనేక మతాలు కలిసి మెలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడమే మనదేశం గొప్పదనమని అన్నారు.
వెబ్ సైట్ ద్వారా క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాలపై స్వామి స్పందించారు. సదరు దినపత్రికపై టీటీడీ ఈవో విజ్ఞప్తితో రూ.100 కోట్ల జరిమానా చెల్లించాలని దావా వేశానని చెప్పారు. తన తరపున టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ సత్య సబర్వాల్ కేసు వాదిస్తారని చెప్పారు. కేసు ఫైల్ అయ్యి 90 రోజులైనా…సదరు దినపత్రిక నుంచి ఇంతవరకు ఎలాంటి కౌంటర్ దాఖలు కాలేదని అన్నారు. ఈ రోజు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆ పత్రికను ఆదేశించిందని చెప్పారు.
దేశంలో ఎక్కడా హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదని స్వామి అభిప్రాయపడ్డారు. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని చెప్పారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని స్వామి గుర్తు చేశారు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి అవసరమని, అందుకోసం తాను చాలాకాలంగా పోరాటం చేస్తున్నానని స్వామి గుర్తు చేసుకున్నారు.
టీటీడీ కాగ్ పరిధిలోకి రానుందని, వచ్చే ఏడాది నుంచి టీటీడీ ఆడిట్ కాగ్ పరిధిలోకి వెళుతుందని భావిస్తున్నానని స్వామి అన్నారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్నది తన అభిమతం అని స్వామి చెప్పారు. హిందూ దేవాలయాలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోనని, దేశంలో ఎక్కడ హిందూ దేవాలయాలను కించపరిచినా తాను న్యాయపోరాటం చేస్తానని అన్నారు.