తప్పు చాలా మంది చేస్తారు. కానీ దానిని సమర్థించుకోవటంలో హద్దులు మీరిదే అందరికీ దూరమవుతారు. రాజకీయ నాయకుల్లో కొందరు ఇలాగే పతనం అయ్యారు. తమ మీద వచ్చే అవినీతి ఆరోపణల్ని సర్ది చెప్పుకోవటానికి కిందా మీదా పడే నేతల్ని చూశాం. అందుకు భిన్నంగా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తప్పు చేయడమే కాకుండా… అవును తప్పు చేశా అయితే ఏంటి అంటున్నట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. ఇది వైరల్ గా మారింది.
తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఎంపీ సోయం మాట్లాడుతూ.. ‘‘గతంలోని ఎంపీల మాదిరి నేనేమీ ఎంపీ లాడ్స్ నిధులను గోల్ మాల్ చేయలేదు. ఒక ఎంపీగా నాకంటూ సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదన్న ఉద్దేశంతో .. ఆ నిధులతో ఇంటిని నిర్మించా. కొడుకు పెళ్లి చేశా. రెండు మూడు రోజుల్లో రూ.5 కోట్లు వస్తాయన్న సమాచారం వచ్చింది. ఆ నిధులతో ప్రజోపయోగ పనులు చేస్తా. పార్టీని బలోపేతం చేస్తా’ అంటూ ఆయన చెప్పిన మాటల వీడియో ఒకటి వైరల్ గా మారింది.
చేసిన తప్పును ఇంత ఓపెన్ గా ఒప్పుకోవటం ఎంపీ సోయం బాపూరావు గొప్పతనమని… అంటారనుకున్నారు. కానీ అది చాలా బ్యాడ్ అయిపోయేటప్పటికి ఆయన అడ్డంగా దొరికిపోయారు. వైరల్ అవుతున్న వీడియోలోని మాటల్లో నిజం లేదని.. అదంతా ఎడిట్ చేసిన వెర్షన్ గా పేర్కొన్నారు. ఎంపీ లాడ్స్ నిధులను తాను సొంతానికి వాడుకున్నట్లుగా తేలిస్తే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
తనను బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రచారానికి తెర తీశారన్నారు. తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం చేస్తూ.. ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు. ఎంపీ లాడ్స్ పనులకు కలెక్టర్ అనుమతులు ఉంటాయని.. ఇష్టారాజ్యంగా వాడుకోవటానికి అవకాశం లేదని స్పష్టం చేసిన సోయం బాపూరావు.. తన మీద తప్పుడు ప్రచారం చేసే వారి గురించి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కంప్లైంట్ చేస్తానని చెప్పారు. తనను రాజకీయంగా దెబ్బ తీయటానికి పాయల్ శంకర్.. రాథోడ్ రమేశ్ లు ఇలాంటి పనులు చేస్తారన్నారు. ఎంపీ వ్యాఖ్యల్ని ఖండించేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ప్రెస్ మీట్ పెట్టాలని ముందు అనుకున్నా.. అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేసుకోవటం గమనార్హం.