సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దీక్ష చేస్తున్న ఆయన.. దాన్ని పాదయాత్రగా మార్చేస్తూ తీసుకున్న నిర్ణయం అనూహ్యంగా మారింది. కాంగ్రెస్ నేతలు మల్లు రవి.. సీతక్కలు చేసిన సూచనను వెంటనే అమల్లో పెట్టిన ఆయన.. అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కారులో ప్రయాణించాల్సిన ఆయన.. కాలినడకన బయలుదేరారు.
రైతు సమస్యల మీద పోరాటం చేస్తున్న రేవంత్.. అచ్చంపేటలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. రేవంత్ దీక్ష కాకుండా పాదయాత్ర చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందన్న సూచన చేశారు. దీంతో.. వారి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు రేవంత్. ఆయన మాట్లాడుతూ.. తన వెంట ఉంటానని తన ఇంటి ఆడబిడ్డ సీతక్క ఆదేశం ఇచ్చిందని.. ఏ ముఖం పెట్టుకొని కారెక్కి ఇంటికి వెళ్తాను అంటూ.. పాదయాత్రను అప్పటికప్పుడు ప్రకటించారు.
‘నాకు వయసు లేదా? ఓపిక లేదా? నేను రైతుల కోసం చెమట చిందించనా?’ అంటూ ప్రశ్నలు వేసిన ఆయన.. ఆ వెంటనే అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్రను ప్రారంభించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కోట్లాడే శక్తిని నల్లమల బిడ్డనైన తనకు ఇచ్చారన్న రేవంత్.. రైతులు కోట్లు సంపాదించటానికి వ్యవసాయం చేయరన్నారు. ఎకరం భూమి ఉంటే దాన్ని ఆత్మగౌరవంగా భావించి వ్యవసాయం చేస్తారని.. మార్కెట్లో ఏం కొనాలన్నా అమ్మేవాళ్లే ధర చెబుతుంటారని.. రైతు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలకు రూ.15లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారని.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాల్లో కొనుగోలు కేంద్రాలు.. మార్కెట్ యార్డులు.. మద్దతు ధర లేదన్నారు. మోడీ.. కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే అన్న రేవంత్.. రైతుల పంటలు కొనని కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అని ప్రశ్నించారు. రేవంత్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పటమే కాదు.. సొంత పార్టీలోనూ సంచలనంగా మారుతుందని చెప్పక తప్పదు. మరి..రేవంత్ పాదయాత్రపై అధికారపక్షం ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది.