పదేళ్ల కేసీఆర్ పాలనకు చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొందరు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టికెట్లు ఆశిస్తున్న కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి షాకిచ్చారు.
బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు రంజిత్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేశానని రంజిత్ అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని కేసీఆర్ ను కోరారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని రంజిత్ చెప్పారు.
మరోవైపు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ కిడ్నాప్ ఎపిసోడ్ కు తెరదించుతూ ఆయన బీజేపీలో చేరారు. 3 రోజుల క్రితమే బీజేపీలో చేరేందుకు రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ నేతలు కొందరు బలవంతంగా ఆయనను వరంగల్ నుంచి హైదరాబాద్ కు తరలించే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. జనగామ వద్ద రమేష్ కారును బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వార్తల్లో నిలిచిన రమేష్ తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆరూరి రమేష్ కాషాయ కండువా కప్పుకున్నారు.
మరోవైపు, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, వీరి రాకపై కొందరు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. డీకే రికమండేషన్ తో కాంగ్రెస్ లో చేరాలని మల్లారెడ్డి భావిస్తున్నారట. గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయపరమైనవి మాత్రమేనని మల్లారెడ్డి క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు.