పార్లమెంటులో తెలుగు ఎంపీలకు మాట్లాడే అవకాశం రావడమే చాలా తక్కువ. అవకాశాలు వచ్చినా చాలా తక్కు సమయం మాత్రమే మాట్లాడేందుకు ఉంటుంది. ఆ తక్కువ టైంలో చెప్పాలనుకున్న పాయింట్ ను ప్రభావవంతంగా చెప్పడం…ఆ చెప్పే పాయింట్ ను సభలోని వారంతా వినేలా చేయడం కత్తిమీద సాము వంటిదే. ఇటువంటా సాము చేయడంలో శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆరితేరారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్న కేంద్రం పెద్దలకు …అదే సభలో స్టీల్ ప్లాంట్ లాభాల చిట్టాను లెక్కలతో సహా చూపించి తెలుగోడి సత్తా చాటారు సిక్కోలు సింగం రామ్మోహన్ నాయుడు.
తాజాగా మరోసారి లోక్ సభలో మాట్లాడే అవకాశం రావడంతో జగన్ సర్కార్ పై రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందే విరుచుకుపడ్డారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడే పరిస్థితులు లేవని, మేధావులు, ఉద్యోగులు, ఆఖరికి ప్రతిపక్ష నేతలు కూడా నోరు మెదపలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని, ఇనుప రాడ్లతో టీడీపీ కార్యకర్తలు, ఆఫీసు సిబ్బందిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయని మండిపడ్డారు.
ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నేతపై కూడా దాడి జరిగిందని, ఆ నేతను ఎంపీ మురళీధరన్ కూడా పరామర్శించారని గుర్తు చేశారు. దిశ యాక్ట్ కు రాష్ట్రపతి ఆమోదం లభించలేదని, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరణలు రావాల్సి ఉందని కేంద్రం చెబుతోందని గుర్తు చేశారు. కానీ, ఏపీలో మాత్రం దిశ యాక్ట్ పేరుతో కేసులు పెడుతున్నారని, ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందని చెప్పారు. దిశ యాక్ట్ కు చట్టబద్దత ఉందో లేదో చెప్పాలని అమిత్ షాను నిలదీశారు.