ఏపీ ప్రభుత్వంపై, బాధ్యత గల పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసాపురం ఎంపీ రఘురామరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ లోపాలను, జగన్ వైఫల్యాలను ఎత్తిచూపినందునే జగన్ సర్కార్ కక్ష సాధిస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కస్టడీలో ఉన్న తనను పోలీసులు కొట్టారని రఘురామ లిఖితపూర్వకంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టులో రఘురామ మెడికల్ రిపోర్టుపై విచారణ జరిగింది. రఘురామను గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా రఘురామ మెడికల్ రిపోర్టును పోలీసులు హైకోర్టుకు సమర్పించగా…ఆ నివేదికను న్యాయవాదులకు హైకోర్టులో చదివి వినిపించారు. రఘురామ రెండు పాదాలు వాచాయని, అరికాళ్ల రంగు మారిందని, కానీ, బయటకు గాయాలు కనిపించడం లేదని డాక్టర్లు తమ మెడికల్ రిపోర్టులో పేర్కొన్నారు. రఘురామకు గుండె నొప్పి ఉండడం, శస్త్రచికిత్స జరగడం వంటి కారణాలతో కార్డియాలజిస్ట్కు చూపించామని తెలిపారు.
రఘురామ ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. రఘురామ ఆరోగ్యం సాధారణంగానే ఉందని నెఫ్రాలజిస్ట్ లు కూడా చెప్పారని వైద్యులు పేర్కొన్నారు. అయితే, ఈ మెడికల్ రిపోర్ట్ పై వైసీపీ నేతల ఒత్తిడి ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి భర్త గులకవరపు రవి కుమార్కు వైసీపీ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే అంబటికితో సన్నిహిత సంబంధాలున్నాని నెటిజన్లు అంటున్నారు.