రాజద్రోహం కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. రఘురామ అరెస్టు, కస్టడీలో ఆయనపై దాడి ఆరోపణల వ్యవహారాల నేపథ్యంలో ఈ కేసు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ పై విడుదలైన రఘురామ…ఢిల్లీ వెళ్లి తన ఆట మొదలుపెట్టారు. రఘురామ ఫిర్యాదు నేపథ్యంలోనే గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై బదిలీవేటు పడిందని చర్చ జరుగుతోంది. మరోవైపు, తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు ఏపీ బార్‌కౌన్సిల్‌కు మరోపక్క ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే రఘురామ తాజాగా మరో బాంబు పేల్చారు. తనపై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిలా పరిగణించాలని ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ పార్టీల ఎంపీలు, పార్లమెంటు న్యాయ, ప్రజా ఫిర్యాదుల స్థాయీ సంఘం చైర్మన్ భూపేంద్రయాదవ్‌తోపాటు సభ్యులకు లేఖలు రాశారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ఎత్తిచూపినందుకే తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ కేసులున్నాయని, వాటిలో జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నారని, జగన్ తో పాటు కేసులు ఎదుర్కొంటున్నవారు జగన్ మంత్రివర్గంలో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
వ్యక్తిగత కక్షతోనే తనపై రాజద్రోహం కేసు నమోదు చేశారని రఘురామరాజు ఆరోపించారు. ఒక ఎంపీపై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిగానే పరిగణించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే రఘురామ రాసిన లేఖను తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్ ట్విట్టర్లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ లేఖను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని మాణికం ఠాగూర్ అన్నారు. ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనమన్నారు. ఎంపీకే ఇలా జరిగితే సామాన్య రాజకీయ కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.