సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరడ్డి మర్డర్ కేసు విచారణ వేగవంతమైన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణలో ఇప్పటికే పలువురు కీలక వాగ్మూలాలు ఇవ్వడంతో చాలా పేర్లు బయటకు వచ్చాయి. అయితే, లోతుగా విచారణ జరిపే కొద్దీ ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భూ వివాదాల కారణంగానే హత్య చేసినట్లు నిందితులు పోలీసుల ముందు అంగీకరించారు. ఈ క్రమంలోనే నిందితులకు ప్రాణహాని ఉందని సీబీఐ చీఫ్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా లేఖ రాయడం సంచలనం రేపుతోంది.
వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని రఘురామ కోరారు. పరిటాల రవి హత్య కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆర్ఆర్ఆర్ కోరారు. వివేకా హత్య వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తేల్చాలని కోరారు. ఈ కేసులో సీబీఐ ప్రతిష్టకూ భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
పలు సీబీఐ కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డిని వివేకా హత్య కేసులో ప్రశ్నించాలని రఘురామ కోరారు. ఈ కేసులో ‘గొడ్డలి’ అనే పదం ఎలా బయటికి వచ్చింది? ఈయనకు ఎవరు చెప్పి ఉండొచ్చు? అనే కోణంలో విచారణ జరపాలని సూచించారు. ‘గుండెపోటు’ అని చెప్పిన విజయసాయిరెడ్డిని విచారణ జరపాల్సిందేనని, విజయసాయి రెడ్డిని జైలుకు పంపేంతవరకు తాను విశ్రమించనని
షాకింగ్ కామెంట్లు చేశారు.
దీంతోపాటు, ఏపీ ప్రభుత్వం బడ్జెట్ కు, ఖర్చు చేసిన దానికి సంబంధమేలేదని రఘురామ విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందన్నారు. ఆర్థిక అరాచకానికి పరాకాష్ట అని, దీన్ని ఆర్థిక ఉన్మాదం అంటారా? ఆర్థిక తీవ్రవాదం అంటారా? ఆర్థిక అనావృష్టి అంటారా? ఏమంటారని రఘురామ ప్రశ్నించారు.