వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఇరకాటంలో పెట్టాలని వైసీపీ నేతలు భావిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే, ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సీఐడీ అధికారులు…సరిగ్గా సంక్రాంతికి కొత్త అల్లుళ్లు వచ్చినట్టు….పండగ ముందు రఘురామకు నోటీసులిచ్చారు. విచారణకు రావాలంటూ హుకుం జారీ చేశారు. అయితే, ఉన్నపళంగా నోటీసులిస్తే రావడం సాధ్యం కాదని ఆయన చెప్పడంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఈ క్రమంలోనే నేడు రఘురామ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
కానీ, ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీకి రఘురాజు లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల ఈనాటి విచారణకు హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యానని తెలిపారు. విచారణకు హాజరు కావడానికి 4 వారాల సమయం కావాలని కోరారు. తనను చంపేస్తారని, తన హత్యకు కుట్ర పన్నుతున్నారని రఘురామ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కామెంట్లపై విజయసాయి స్పందించారు.
”గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని ‘నన్ను చంపేస్తారు’ అని ఏడుపు మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకైనా దూకి నన్ను ఎవరో తోసేశారు అనే రకం.” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి ట్వీట్‌కి రఘురామ అదిరిపోయే కౌంటరిచ్చారు. ‘‘వీడిని విశాఖ నుంచి గెంటేసి అండమాన్‌కి పంపిస్తే మళ్లీ వచ్చేశాడు. ఎన్నిసార్లు సీఎం చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు. లెటజ్ వెయిట్ అండ్ సీ’’ అని విజయసాయి ట్వీట్ ను జతచేస్తూ రఘురామ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం రఘురామ చేసిన ట్వీట్ వైరల్ అయింది.