సీఎం జగన్ కు, వైసీపీ నేతలకు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా మారిన సంగతి తెలిసిందే. జగన్ పాలనను, వైసీపీ ప్రభుత్వ అసంబద్ధ విధానాలను ఎండగడుతోన్న వైనంపై వైసీపీ నేతలు కక్కలేక మింగలేక ఉన్నారు. ఇక, ఈ క్రమంలోనే అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సభకు రఘురామ హాజరు కావడం…ఆ సభలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆలింగనం చేసుకోవడం..వంటి సీన్లు చూసిన వైసీపీ నేతలకు కంటిమీద కునుకు కరువైందట.
ఈ క్రమంలోనే రఘురామపై మంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చంద్రబాబు మీద కౌగిలించుకునేంత అభిమానం ఉంటే జగన్ బొమ్మ మీద గెలిచిన రఘురామ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ నుంచి పోటీ చేయాలని బాలినేని సవాల్ విసిరారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీని పొగడడం వంటి డ్రామాలు మానుకోవాలంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలంటూ ఛాలెంజ్ చేశారు.
ఈ క్రమంలోనే బాలినేని వ్యాఖ్యలకు రఘురామ కౌంటర్ ఇచ్చారు. కౌగిలింతకే పార్టీ మారిపోతే కాళ్లమీద పడుతున్న వాళ్లు ఏం చేయాలయ్యా మిత్రమా బాలినేని అంటూ సెటైర్ వేశారు. గెలిచిన వెంటనే ప్రధాని మోడీ కాళ్లపై పడ్డ జగన్ ను ఉద్దేశించి రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఖాళీగా ఉంటే పేకాడుకోవాలని..సలహాలివ్వొద్దని రఘురామ అన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.