టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి గత పదేళ్లుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా జూ.ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. మరికొందరైతే, 2023 ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారని కూడా పుకార్లు పుట్టించారు. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే తారక్ రావాలని, టీడీపీ పగ్గాలు కూడా తారక్ కు ఇవ్వాలని సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు వస్తుంటాయి. అవన్నీ పుకార్లేనన్న సంగతి తెలిసిన తారక్ మాత్రం తన మానాన తాను వరుస సినిమా షూటింగులు, ప్రోగ్రామ్ లతో బిజీబిజీగా ఉన్నారు.
రాజకీయాల్లోకి రావడానికి ఇది సమయం…. సందర్భం కాదని తారక్ కొద్ది నెలల క్రితం కూడా మీడియా ముఖంగా ప్రకటన చేశారు. అయితే, అసలు రాజకీయాల్లోకి మళ్లీ రానని తారక్ చెప్పకపోవడంతో ఏదో ఒక రోజు తారక్ రాజకీయాల్లోకి వస్తారని ఫ్యాన్స్ కొందరు బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే అడపాదడపా ఏదైనా కార్యక్రమాల సందర్భంగా, చంద్రబాబు పర్యటనల సందర్భంగా జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలుస్తుండడం చర్చకు తావిస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో తారక్ ఫ్లెక్సీలు వెలిసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కొందరు అభిమానులు ఫ్లెక్సీలు వేసిన వైనం చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. వైసీపీ నేతలే ఆ ఫ్లెక్సీలు వేశారని సంచలన ఆరోపణలు చేశారు. కానీ, తమ పార్టీ నేతలు అడ్డంగా బుక్కయ్యారని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు వేస్తే వాటిపై హరికృష్ణ ఫొటో కూడా ఉంటుందని వైసీపీ నేతల గుట్టురట్టు చేశారు. తాజాగా ప్రకారశం, నెల్లూరులో వేసిన ఫ్లెక్సీలలో హరికృష్ణ ఫొటో లేదని సెటైర్లు వేశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, అది ఓర్చుకోలేకే వైసీపీ నేతలు ఈ తరహా ఫ్లెక్సీలు పెడుతున్నారని ఆరోపించారు.
అమ్మఒడి డబ్బులు సగం మంది ఖాతాలలో జమ కాలేదని, మామయ్య నొక్కేసిన డబ్బులు పిల్లలకు చేరలేదని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం పెరిగిందని, అమ్మకాలు తగ్గలేదని, దొంగ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. 2024లో వైసీపీ ప్రభుత్వం పోవడం ఖాయమని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఫొటోలు వేసుకుంటున్నారని చురకలంటించారు.