ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యవహారంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అందులోనూ సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెళ్లి వచ్చిన తర్వాత ఆ ప్రచారం మరింత జోరందుకుంది. ఏప్రిల్ నెలలో ముందస్తు ఎన్నికలపై జగన్ ప్రకటన చేయబోతున్నారని, అందుకోసం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల పర్మిషన్ జగన్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికల వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని రఘురామ కూడా అభిప్రాయపడ్డారు. ఢిల్లీ సర్కిల్స్ లో ఈ వ్యవహారంపై జోరుగా ప్రచారం జరుగుతోందని అన్నారు. కొత్త అప్పుల కోసం జగన్ సర్కార్ ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సరిపడా నిధులు లేవని అన్నారు. అందుకే, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తప్ప జగన్ ముందు మరో మార్గం లేదని అన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడంలేదని రఘురామ అభిప్రాయపడ్డారు. ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారని, అది ఏమైందని రఘురామ ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ మాట తప్పడం జగన్ కు అలవాటైపోయిందని, జగన్ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ప్రజల పట్ల తన వైఖరి మార్చుకోవాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు రఘురామ. మరి రఘురామ కామెంట్లపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.