ఏపీలో కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతోందన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాత మంత్రులలో ఆరుగురి వరకు కొనసాగించే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్త కేబినెట్ కూర్పుపై వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నానిలను తప్పించరని, దమ్ముంటే ఆ ముగ్గురినీ మంత్రివర్గం నుంచి తప్పించాలని రఘురామ ఛాలెంజ్ చేశారు.
ఒకవేళ జగన్ ఆ ధైర్యం చేస్తే పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. రాజీనామా చేసిన మంత్రులందరి మొహాలు దిగాలుగా మారిపోయాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందని, ఇది అసమర్థ ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు. సరిపడా విద్యుత్ లేకపోవడంతో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇచ్చిన ప్రభుత్వం ఇదని ఎద్దేవా చేశారు. ప్రజల మనోభావాలు, వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునేందుకు జగన్ మారువేషం వేసుకుని తిరగాలని సూచించారు.
తన గురించి, తన ప్రభుత్వ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వింటే జగన్ గుండె ఆగి చనిపోతారన్నారు. ప్రధాని పిలిస్తే వచ్చారో లేక అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారో జగన్ గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పాలని సవాల్ విసిరారు. కార్పొరేషన్ల ద్వారా ఇష్టాసారంగా అప్పులు చేస్తున్నందుకు జగన్ కు మోడీ క్లాస్ పీకారని రఘురామ ఆరోపించారు. మరి, ఈ కామెంట్లపై వైసీపీ నేతలు స్పందిస్తారా లేక ఎప్పటిలాగా సైలెంట్ గా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది