నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టు వ్యవహారంలో గంట గంటకు నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. రఘురామరాజు ఆరోగ్యం బాగోలేనందున ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ, ఆయనను గుంటూరు జీజీహెచ్ కు తరలించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రఘురామ ఆరోగ్యంపై మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే రఘురామను తాజాగా గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకు ఖైదీ నంబర్ 3648 కేటాయించారు. జైల్లో పాత బ్యారక్ లోని ఓ సెల్ ను రఘురామకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దీంతో, అక్కడ హై టెన్షన్ ఏర్పడింది. అనారోగ్యంతో ఉన్న రఘురామను జైలుకు తరలించడంపై విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్ ను సిద్ధం చేశారు. ఆ రిపోర్టును జిల్లా కోర్టులో మెజిస్ట్రేట్‌కు సీల్డ్ కవర్లో వైద్యబృందం సమర్పించింది. ఆ సీల్డ్ కవర్ ను హైకోర్టు డివిజన్ బెంచ్‌కు జిల్లా మెజిస్ట్రేట్ అందించారు. ఆ సీల్డ్ కవర్ లోని నివేదిక ప్రకారం హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో, ఈ వ్యవహారంలో హైకోర్టు తదుపరి స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.