ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. వృద్ధ్యాప్య పెన్షన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి పెన్షన్ రూ. 250 పెంచాలని లేఖలో పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్ ను ఈ నెల నుంచి రూ.2750కు పెంచి చెల్లించాలని కోరారు. ఏడాదిగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ ఎరియర్స్ మొత్తం రూ.3 000 కూడా చెల్లించాలని కోరారు. ఎన్నికల హామీలో పెన్షన్ ను రూ.2000 నుంచి రూ.3000 వరకు పెంచుతామని ఇచ్చిన హామీకి ప్రజల మద్దతు లభించింది, ఆ హామీని నిలబెట్టుకోవాలకి ఆర్ఆర్ఆర్ కోరారు.
అంతకుముందు, కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను రఘురామ కలిసిన సంగతి తెలిసిందే. పోలవరం నిర్వాసితుల పేరుతో నకిలీఖాతాలు క్రియేట్ చేసి డబ్బులు కాజేస్తున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో 25 శాతం కమీషన్ లు దండుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. షెకావత్ తో రఘురామ భేటీ అయిన రెండు రోజుల తర్వాత ఏపీ సీఎం జగన్….షెకావత్ ల భేటీ జరగనుండడం విశేషం. మరి, ఈ భేటీలో పోలవరంపై రఘురామ ఇచ్చిన ఫిర్యాదు గురించి చర్చ జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, ఏపీ సీఐడీ అధికారులు తనతో వ్యవహరించిన తీరుపై రఘురామ…గవర్నర్లందరికీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు జగన్ మినహా సీఎంలందరికీ రఘురామ లేఖలు రాయగా….చాలామంది రఘురామకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. ఏది ఏమైనా రఘురామ ఎపిసోడ్ లో జగన్ కు చిక్కులు తప్పవని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే, ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్ఆర్….ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడం…ఆయనకు ఉద్యోగగండం ఉందనే టాక్ రావడం చర్చనీయాంశమైంది.