‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ పేరుతో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమం అంచనాలకు తగ్గట్లే విజయవంతమైంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు చేసిన పనుల్ని ప్రస్తావిస్తూ పలువురు చెప్పిన మాటల్ని వినే వేళ.. పలువురు తీవ్రమైన భావోద్వేగానికి గురి కావటం కనిపించింది. సభలో మాట్లాడిన వక్తల్లో అందరికి తెలిసిన వారు కొందరైతే.. తెలియని వారెందరో. వారంతా చంద్రబాబు గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన కారణంగా తమ జీవితాల్లో వచ్చిన మార్పులే కాదు తెలుగువారి బతుకుల్ని ఆయన విజన్ ఎంతలా మార్చిందన్నవిషయాల్ని చెప్పటం కనిపించింది.
ఈ సభలో చివరగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుతో మాట్లాడించారు. అప్పటికే బాగా ఆలస్యం కావటం.. గంటల కొద్దీ కూర్చొని.. ఇంటికి వెళ్లేసరికి అర్థరాత్రి అవుతుందన్న ఆలోచనతో కొంతమంది వెళ్లిపోయినప్పటికీ.. ఎంత ఆలస్యమైనా.. కార్యక్రమం మొత్తం పూర్తి అయ్యే వరకు ఉందామని ఉన్నోళ్లు పలువురు ఉన్నారు. ఇలా ఉన్న వారిలో అరవై ఏళ్లకు పైనే ఉన్న వారు పలువురు ఉండటం కనిపించింది. ఈ సభలో మాట్లాడిన రఘురామ రాజు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎంతోమంది ఈ రోజు ప్రేమ.. అభిమానంతో ఇంతసేపు ఇక్కడ కూర్చున్నారు. బతికి ఉన్న వ్యక్తులకు ఇంత ఘనకీర్తిని చూడలేదు. ఇది.. ఇంపాజిబుల్. ఎవరైనా పోతే మాట్లాడుకుంటాం. బతికి ఉన్న వ్యక్తి గురించి.. ఇంత గొప్పగా.. ఇంతమంది మాట్లాడారు. తప్పు చేసినా.. కొందరికి అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి. వాడికి కూడా థ్యాంక్స్ చెప్పేద్దాం. ఈ రోజు ఈయన ఘనతను విశ్వవ్యాప్తం చేసినందుకు.. లెటజ్ బీ జనరస్.. లెటజ్ థ్యాంక్స్ థట్ ఫెలో’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇక.. ఏపీలో న్యాయానికి పరీక్ష అంటూ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వాయిదా పడితే ఎల్లుండి అయినా న్యాయం జరగాలి. ఆఖరికి అధర్మం తరఫున వాదించేవాడిని న్యాయమూర్తిని చేసినా.. రేపు న్యాయం జరగాలి. చూద్దాం.. రేపు న్యాయం నెగ్గుతుందో లేదో చూద్దాం. ఇంకా.. రేపు న్యాయానికి అన్యాయం జరిగితే.. సుప్రీంకోర్టులో తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఏడో తారీఖు లోపు.. దీపావళిని ఘనంగా జరుపుకుందాం’ అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నరకాసుర వధ జరగాలంటే.. శ్రీకృష్ణుడికి సత్యభామ ఉంది.. అలానే నారా చంద్రబాబు నాయుడుకి భువనేశ్వరి ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ. నిజం గెలవాలి. నిజం గెలుస్తుంది. ఒకపక్క భువనేశ్వరి.. ఇంకో పక్క నా మిత్రుడు నారా లోకేశ్..ఇప్పుడు శ్రీక్రిష్ణుడు చంద్రబాబు అయితే అర్జునుడు పవన్ కల్యాణ్. రాబోయే రోజుల్లో కట్టించేవాడ్నే తెచ్చుకుందాం. కూలగొట్టేవాడ్ని కూల్చేద్దాం’’ అంటూ సరికొత్త నినాదం చేశారు.