ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని, వైసీపీ తరఫున పోటీ చేసిన 25 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు బల్లగుద్ది మరీ చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ మాటను నమ్మిన జనం…నిజంగానే హోదా తెచ్చేస్తారన్న ఆశతో వైసీపీకి 22 మంది ఎంపీలను కట్టబెట్టారు.
అయితే, వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా….హోదా గురించి కేంద్రాన్ని గట్టిగా నిలదీసిన పాపాన పోలేదు. ఇక, వైసీపీ అధినేత జగన్…కాలికి బలపం కట్టుకొని మరీ ఎన్నోమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి హోదాపై పోరు అంటుంటారుగానీ…కేంద్రం తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉంది. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి…సొంత ఎజెండా…లేదంటే పోలవరం, నిధులు, ఏపీకి అప్పులు ఇవ్వండి మహాప్రభో అంటూ దేబరించడం వంటి విషయాలు తప్ప మరో ఊసుండదని టాక్.
కేసుల కోసం కేంద్రం పెద్దలతో జగన్ చీకటి ఒప్పందాలు చేసుకొని లాలూచీ పడ్డారని, తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఎన్నోసార్లు ఆరోపించారు. ఈ విషయాలన్నీ తెలిసినా సరే జగన్ మాత్రం ఎవరేమనుకుంటే నాకేంటి అన్న రీతిలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నానని సినిమా డైలాగులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు.
జగన్ అన్నారని…ఆయన సీరియస్ యుద్ధం చేస్తున్నారా? అని రఘురామ ఎద్దేవా చేశారు. కేంద్రంపై వైసీపీ చేస్తున్నది తమలపాకు యుద్ధమని, మూడేళ్ల నుంచి ఈ యుద్ధం చేస్తున్నారని చురకలంటించారు.. యుద్ధం చేసేవాళ్లు… కనిపిస్తే కాళ్లు పట్టుకుంటారా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో తనపై అనర్హత వేటు వేయాలనే బ్యానర్…హోదా కావాలని మొక్కుబడి ప్లకార్డులు తప్ప ఇతర బ్యానర్ పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. నవ్వితే నవ్వనీ నాకేటి సిగ్గు అన్నరీతిలో తన పార్టీ వైఖరి ఉందని రఘురామ సెటైర్లు వేశారు.
Comments 1