ఏపీలో పీఆర్సీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పీఆర్సీ పై ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యోగులను గ్రూపులుగా విభజించాలని సజ్జల చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సజ్జలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు షాకింగ్ కామెంట్లు చేశారు. సజ్జల ఉద్యోగుల్లో వర్గ రాజకీయాలను రెచ్చగొడుతున్నాడని, కనీసం ఎమ్మెల్సీ కూడా కాని, సజ్జల… అన్నీ తానై వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులపై కూడా సజ్జల పెత్తనం చేస్తున్నాడని, సజ్జల తన పరిధికి మించి వ్యవహరిస్తుండటంపై వైసీపీ నేతలు కూడా అసహ్యించుకుంటున్నారని ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగ సంఘాలను బెదిరించే హక్కు సజ్జలకు లేదని రఘురామ అన్నారు. ‘నేనున్నాను… నేను వింటాను’ అని అన్న ముఖ్యమంత్రి… ‘సజ్జల ఉన్నాడు… సజ్జల వింటాడు… సజ్జల చేస్తాడు’ అని ఏనాడూ చెప్పలేదని జగన్ పై రఘురామ సెటైర్లు వేశారు. సజ్జల సకల పాత్రాభినయంపై కోర్టులో వేసిన కేసు ఇప్పటికీ విచారణకు రావడం లేదని విమర్శించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులలో అశాంతిని ఎందుకు సృష్టిస్తున్నారని జగన్ ను ప్రశ్నించారు. ఉద్యోగులతో చర్చలు జరపాల్సిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, ‘ఎం ధర్మరాజు’ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు.
ఎన్టీఆర్ మీద జగన్ కు నిజంగానే ప్రేమ ఉంటే.. ‘అన్న క్యాంటీన్ల‘ను ఎందుకు మూసివేశారని రఘురామ నిలదీశారు. ప్రతి పథకానికీ వైఎస్సార్, జగనన్న పేర్లు పెట్టే బదులు..ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టొచ్చుకదా! అని అన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఆ జిల్లాలో ఆ సామాజిక వర్గం ఓట్లు వచ్చేస్తాయా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చించకుండానే జగన్ ఏకపక్షంగా కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతసామరస్యంపై విజయసాయి నీతులు బోధించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, జాతీయ జెండాలోని రంగులను విజయసాయిరెడ్డి తప్పుగా అర్థం చేసుకోవడం దురదృష్టకరమని రఘురామ చురకలంటించారు.