గుంటూరు నడిబొడ్డులో పట్టపగలే బీటెక్ విద్యార్థిని రమ్య శ్రీని దారుణంగా హత్య చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. రమ్య శ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేయడం, కేసులుప పెట్టడంం రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలో రమ్య శ్రీ హత్యోదంతంపై జగన్ వైఖరిని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు.
అందరూ చూస్తుండగానే పట్టపగలు రమ్యశ్రీని ఒక ఉన్మాది చంపేశాడని, దీనికి జగన్ సిగ్గుపడాలని రఘురామ అన్నారు. ప్రైవేటు స్కూల్ నడుపుకుంటున్న ఇద్దరు టీచర్లు (భార్య భర్తలు) ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఆత్మహత్యలకు ఎవరు కారణం? అని పరోక్షంగా జగన్ ను విమర్శించారు. వారి చావుకు కారణమైన వారిని భగవంతుడు శిక్షిస్తాడని, అమ్మ ఒడి డబ్బులు నాన్న బుడ్డికి వెళ్తున్నాయని, ఆ తరహా స్కీమ్లతో ఇలాంటి వారి జీవితాలు నాశనమవుతున్నాయని మండిపడ్డారు.
ప్రైవేట్ టీచర్లకు జీతాలివ్వడం లేదని, ప్రైవేట్ విద్యాశాలలు మూసేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందరూ చదవాలని జగన్ చెబుతున్నారని, ముఖ్యమంత్రికి మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. సీఎంల పనితీరు ర్యాంకింగ్లో జగన్ లేరని, గత 3 నెలల్లోని పరిణామాలతో ర్యాంక్ పడిపోయిందని అన్నారు. ఏపీలో ఇసుక అక్రమ తరలింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయని, కృష్ణానదిలో 150 లారీలతో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆ 150 లారీల ఇసుక తెలంగాణకు వెళుతోందని, సామాన్యుడికి ఇసుక దొరకడం లేదని రఘురామ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా దొరికే ఇసుకను రూ. 25 వేలు చేసిన ఘనత జగన్ దేనని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని, ఇసుక అంశంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఏపీ అప్పుల దివాళా అంచులలోకి వెళ్ళిపోయిందని రఘురామ విమర్శించారు.