సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా వైఎస్సార్ నామ స్మరణ జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు చొరవతో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని కూడా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై జగన్ సోదరి షర్మిల మొదలుకొని విపక్ష నేతల వరకు సర్వత్రా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చాలావాటికి వైఎస్ఆర్ పేరు పెడుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఏపీలో ప్రతిదానికి వైఎస్ఆర్ పేరు తగిలిస్తున్నారని, రాష్ట్రానికి కూడా రేపో మాపో వైయస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెడతారేమో అని రఘురామ ఎద్దేవా చేశారు. పారిశ్రామిక అనుమతుల కోసం తెచ్చిన యాప్ కు కూడా వైయస్సార్ ఏపీ వన్ అని పేరు పెట్టడం ఏమిటని రఘురామ నిలదీశారు. అడిగేవాళ్లు లేరు కదా అని రాష్ట్రానికి కూడా నీ తండ్రి పేరు పెట్టేస్తావా? రాష్ట్రం నీ అబ్బ సొత్తా? అంటూ జగన్ పై రఘురామ విరుచుకుపడ్డారు.
పార్కులకు వైఎస్ఆర్…కూరగాయల మార్కెట్లకు వైఎస్ఆర్…ఇక ప్రధాని కాళ్లావేళ్లా పడి రాష్ట్రానికి కూడా పేరు మార్చేయండి అంటూ సెటైర్లు వేశారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా అనేవారని… ఇప్పుడు కడప ఎత్తేసి వైఎస్ఆర్ జిల్లా అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కూడా అదే మాదిరిగా వైయస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టి రెండు నెలల తర్వాత వైఎస్ఆర్ ప్రదేశ్ చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. వైయస్సార్ ప్రదేశ్ కు వచ్చి వైఎస్ఆర్ క్యాంటీన్లో తిని వైయస్సార్ పార్క్ లో రెస్ట్ తీసుకొని వైయస్సార్ బస్టాండ్ లో బస్సు ఎక్కి వెళ్లేలా ప్లాన్ చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.
అలా వదిలేయకండ్రా…ఎవడికైనా చూపించండ్రా అంటూ రావు రమేష్ మాడ్యులేషన్లో డైలాగ్ చెప్పి జగన్ పై సెటైర్ వేశారు. ఈ నామకరణ ఉన్మాదానికి, రంగుల పిచ్చకు చిరాకెత్తిపోతోందని విమర్శించారు. ప్రజల హృదయాల్లో వైయస్సార్ ఉండేలా చూడాలని, భవనాలకు రంగులు వేసి గోడలపై పేర్లు రాసి వైఎస్ఆర్ కు ఉన్న ఇమేజ్ ని చెడగొడుతున్నారని అన్నారు. చివరకు ఆయనను ప్రేమించే వారంతా ఆయనను ద్వేషించేలా చేస్తున్నారని, ఇది దురదృష్టకరమని రఘురామ అభిప్రాయపడ్డారు.