టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధరాత్రిపూట అర్ధాంతరంగా అడ్డగోలుగా అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. అశోక్ పై సర్టిఫికెట్ల ఫోర్జరీ కేసు పెట్టిన సీఐడీ అశోక్ బాబును అరెస్టు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అశోక్ బాబు మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా….కోర్టు బెయిల్ ను మంజూరు చేయలేదు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే అశోక్ బాబు అరెస్టును వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. అశోక్ బాబు తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగాన్ని ఆయనకు ఇచ్చారని అన్నారు. లోకాయుక్తలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తితో పిటిషన్ వేయించి, ఆయనను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఆయనను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏమిటో అర్థం కాలేదని మండిపడ్డారు. అశోక్ బాబును అరెస్ట్ చేసి ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదని. జగన్ కు, సీఐడీకి ఉన్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తనకు తెలుసని, కానీ నేరుగా జైలుకు వెళ్లిన జగన్ కు పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియదని చురకలంటించారు.
సర్టిఫికెట్ల వ్యవహారంలో అశోక్ బాబు తప్పు చేసి ఉంటే సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేసును సీఐడీకి అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. సీఐడీకి లేని హక్కులను కల్పించుకుని అశోక్ బాబుపై క్రిమినల్ కేసు పెట్టడంపై ఫైర్ అయ్యారు.
ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారని, ఆయనకు ఎలాంటి హాని చేయవద్దని కోరారు. ఈ అరెస్టుకు సంబంధించి రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని అన్నారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనేదే తన ఆకాంక్ష అని అన్నారు.