ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా మారిన సంగతి తెలిసిందే. జగన్ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రభుత్వ తీరును విమర్శిస్తున్న ఆర్ఆర్ఆర్….వైసీసీకి కంటగింపుగా మారారు. ఈ క్రమంలోనే రఘురామపై రాజద్రోహం కేసులు బనాయించి అరెస్టు చేయించిన జగన్ అండ్ కో…ఆ తర్వాత పరిణామాలను ఊహించలేదు. అరెస్టు చేయిస్తే రాజుగారు కుంగిపోతారనుకున్న వైసీపీ నేతల వ్యూహం పారకపోయే సరికి….రఘురామపై బ్లూ మీడియా విషం చిమ్మడం ప్రారంభించింది. ఆర్ఆర్ఆర్ పరువుకు భంగం కలిగేలా కథనాలు వండి వార్చింది.
ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీ చానెల్ కు రఘురామ గతంలోనే లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా మరోసారి జగన్ బ్లూ మీడియాకు రఘురామ షాకిచ్చారు. ఈసారి సాక్షి మీడియాకు రఘురామ లీగల్ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకుగాను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, 15 రోజుల్లో నోటీసుకు సమాధానమివ్వాలని, అలా చేయకుంటే 50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ వార్నింగ్ ఇచ్చారు.
కొద్ది రోజుల క్రితం సాక్షి టీవీ చానల్‌కు రఘురామ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా సాక్షి చానెల్ అనేక కథనాలు ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు, ఆ నోటీసుపై వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వైఎస్ భారతీరెడ్డి, పాలకవర్గం డైరెక్టర్లు, ఎడిటర్ ఇన్ చీఫ్ నేమాని భాస్కర్, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్లతో ఆ నోటీసులిచ్చారు. అయితే, ఇప్పటిదాకా ఆ నోటీసుపై సాక్షి చానెల్ స్పందించలేదు.